Revanth Reddy  phone to Kishan Reddy :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి.. రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు.  తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని  విజ్ఞప్తి చేశారు.  త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. ఈ విషయం  చొరవ చూపాలని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోరారు. తమ వైపు నుంచి సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


తెలంగాణ నుంచి ఏకైక కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి                                                                           


తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి ఇంకా కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అదే  సమయంలో  ఏ రాష్ట్రంలో అయినా  కొత్తగా ఎవరైనా ముఖ్యమంత్రి పదవి  చేపడితే.. ప్రదానమంత్రితో సమావేశమవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రితో సమావేశమ్యే ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు లక్ష కోట్ల వరకూ రావాల్సి ఉందని.. గతంలో కేటీఆర్ వాదిస్తూ వచ్చారు. అంత కాకపోయినా ఇప్పటికిప్పుడు రావాల్సిన  వాటి ని విడుదల చేయిస్తే.. తెలంగాణ కొత్త ప్రభుత్వానికి కాస్త ఊరట లభిస్తుంది. 


ఆర్థికంగా ఎంతో కొంత రిలీఫ్ పొందాల్సిన స్థితిలో  తెలంగాణ సర్కార్                   


బీఆర్ఎస్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సారంతం వరకూ వివిధ పద్దతుల్లో రావాల్సిన ఆదాయాన్ని్ మందుగానే సమీకరించుకుని ఎన్నికల కోసం ఖర్చు చేసేసింది. అదే సమయంలో పెద్ద ఎత్తున పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. బిల్లులు కూడా చెల్లించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులు సమస్యగా మారనున్నాయి . అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహకారం కూడా ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. రాజకీయంగా తీవ్రంగా విభేదిస్తాం కానీ పరిపాలన విషయంలో కేంద్రం సహకారం ఉండాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 


కిషన్ రెడ్డి సహకరిస్తారా ?                                         


రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. కిషన్ రెడ్డి సహకారంతో.. త్వరలో  పలువురు కేంద్ర మంత్రుల్ని.. ప్రధానిని రేవంత్ రెడ్డి కలవొచ్చని చెబుతున్నారు. ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఇతర అంశాల పూర్తి సమాచారంతో..  ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.