Revanth Reddy Review on Floods: మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి వరదలపై చేసిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం అని.. చెరువుల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆక్రమణలకు పాల్పడినది ఎంతటి వారైనా వదిలి పెట్టబోమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని అన్నారు.


అమెరికాలో మాజీ మంత్రి జల్సా
చెరువులు, నాలాల ఆక్రమణల జాబితా సిద్దం చేయాలి. మాజీ మంత్రి ఆక్రమణ వల్లనే ఖమ్మంలో వరదలు వచ్చాయనే ఫిర్యాదులు వచ్చాయి. అమెరికాలో జల్సాలో మునిగి తేలుతున్న ఆయన.. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నడు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా హరీష్ రావు ఖమ్మం పర్యటనకు పోయిండు. ఖమ్మం మాజీ మంత్రి ఆక్రమణలపైన తొలగింపునకు హరీష్ రావు సహకరిస్తారా? 


30 వేల ఎకరాల్లో పంట నష్టం
28 సెంటిమీటర్ల వర్షం కురిసినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. అయినా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. జిల్లాలో నలుగురు చనిపోయారు. అందులో ఇద్దరు ఈ జిల్లా వాసులు, మరో ఇద్దరు ఖమ్మం జిల్లా వాసులు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 680 మందికి పునరావాసం కల్పించాం. సీతారామ తండాలో వరద సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ ఎస్సై నగేష్ కి అభినందనలు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తాం. ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తండాలను ఒకే ప్రాంతానికి తరలించి అదర్శ కాలనీ నిర్మించాలని కలెక్టర్ కు ఆదేశించాం. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి రూ.10 వేల సాయం అందిస్తాం. తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశాం. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధాన మంత్రిని కోరుతున్నాం. 


వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలి. కూలిపోయిన విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్దరించాలి. వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై
బ్లూబుక్ ను తయారు చేసుకోవాలి. వాటిని కలెక్టరేట్లలో ఉంచాలి. 


కేసీఆర్ ఏనాడైనా పరామర్శకు వచ్చారా?
వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా పరామర్శకు వచ్చారా..? మాసాయిపేటలో పసిపిల్లలు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదు. హైదరాబాద్ శివారులో పశు వైద్యురాలిని హత్యచేస్తే వెళ్లి చూడలేదు. మానవత్వం లేని మనిషి కేసీఆర్. ప్రతిపక్ష నేత ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడటం లేదు? స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులకు సాయం కోసం ముందుకు రావాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.