Revant Reddy : మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని బీఆర్ఎస్ లో చేర్చుకుని  సీఎంఓలో ప్రజాధనంతో జీతం ఇస్తూ ఉద్యోగం ఇచ్చారని బీఆర్ఎస్‌పై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రకు చెందిన శరత్ మర్కట్ ను   ఇటీవల బీఆర్ఎస్ లో చేర్పించుకున్న కేసీఆర్..   సీఎం కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని ఆరోపించారు. అతడికి  నెలకు లక్షా యాభై వేల జీతం ఇచ్చి ప్రైవేట్ సెక్రటరీగా  పెట్టుకున్నారని  వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు.    పరాయి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ కోసం  ప్రజల సొమ్మును  వినియోగిస్తుండని విమర్శించారు. 

 తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మహారాష్ట్రకు చెందిన వాళ్లకు జాబులిస్తుండని ధ్వజమెత్తారు రేవంత్. జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మహారాష్ట్రకు చెందిన వారు  బీఆర్ఎస్ లో చేరుతున్నారనేది  ఓ నాటకమని విమర్శించారు రేవంత్.   కిరాయి మనుషులను రప్పించి రోజుకో వేషం వేయించి  పార్టీలో చేర్పించుకుంటున్నారని అన్నారు.  ఇందులో భాగంగా తెలంగాణ మోడల్‌కు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం వదిలేసి శరద్ మడ్కర్ అనే వ్యక్తి బీఆర్‌ఎస్‌లో చేరారని పత్రికల్లో ప్రచారం చేసుకున్నారు. ఏప్రిల్ 10న బీఆర్‌ఎస్‌లో చేరిన అతనికి మే 2న సీఎం ప్రైవేటు సెక్రటరీగా నియమించారు. ఇందుకు సంబంధించిన జీవోను  రహస్యంగా ఉంచారు. 

సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్లను తెచ్చి పెట్టుకుంటున్నారు. పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారు. ఎవరి సొమ్మని ఏడాదికి రూ.18 లక్షలు అతనికి జీతం ఇస్తున్నారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలి..' రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.కర్ణాటకలో బీజేపీని గెలిపించేందుకే సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.   బీజేపీని గెలిపించేందుకే కర్ణాటకలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని.. నిజంగా బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే కర్ణాటకలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీని ఓడించాలని ప్రకటించాలని సవాల్ చేశారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని అన్నారు. కేసీఆర్ సచివాలయాన్ని ప్రయివేట్ ఎస్టేట్ అనుకుంటున్నారని.. త్వరలోనే ఆయన భ్రమలు తొలగిపోతాయన్నారు.           

ఈ నెల 8న సరూర్ నగర్‌లో సాయంత్రం 3 గంటలకు యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ రాహుల్ ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణలోని 20 లక్షల విద్యార్థులకు, 30 లక్షల నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా.. 8న జరిగే యువ సంఘర్షణ సభకు తరలిరావాలని రేవంత్ రెడ్డి కోరారు. రైతు డిక్లరేషన్‌లా సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని తెలిపారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి విద్యార్థి, నిరుద్యోగులు మద్దతుగా తరలిరావాలని అన్నారు.