Hyderabad News: సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. మూడేళ్ల బాలుడు సహా ఇద్దరు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. హైదరాబాద్ లోని యాకుత్ పురాకు చెందిన షేక్ కైసర్, అతని అన్న కొడుకు మూడేళ్ల షేక్ ముస్తఫా, సమీప బంధువు జగద్గిరిగుట్టకు చెందిన మహమ్మద్ సోహెల్(17) గురువారం సిద్దిపేటకు వెళ్లారు. సిద్దిపేట లోని దుద్దెడలో జరుగుతున్న ఫంక్షన్ లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి గజ్వేల్ మండలం మక్తమాసాన్ పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో గురువారం పగటి సమయంలో వారు వర్గల్ మండలం నెంటూరు సామల చెరువు సమీపంలో ఉన్న బంధువుల పొలానికి వెళ్లారు. పొలం వద్ద నుండి సమీపంలోని సామల చెరువుకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు మూడేళ్ల ముస్తఫా జారి చెరువులో ఉన్న గుంతలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు సోహెల్ గుంతలో దిగాడు, వారిని రక్షించాలని ఖైసర్ గుంతలో దిగాడు. ఎవరికీ ఈత రాకపోవడంతో బాలుడితో పాటు వారిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చెరువులో నుండి ముస్తఫాను బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు స్థానికుల సహాయంతో చెరువు నుండి ఖైసర్, సోహెల్ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు ఖైసర్ కు భార్య, 3 నెలల కూతురు ఉన్నారని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అప్పటి దాకా ఆడుతూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన మూడేళ్ల బాలుడు ముస్తఫా నీటిలో మునిగి విగత జీవిగా మారతడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాదిన్నర క్రితం డిండి జలాశయం వద్ద ప్రాణం తీసిన సెల్ఫీ
నల్గొండ జిల్లా డిండి జలాశయం వద్ద విషాదం చోటుచేసుకుంది. 2021 అక్టోబర్ 17వ తేదీన సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. జలాశయం వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జలాశయంలో పడిపోయి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సాగర్, ప్రవీణ్శ్రీశైలం దేవాలయం దర్శనానికి కలిసి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తూ దిండి జలాశయం వద్ద కాసేపు కాలక్షేపం చేద్దామనే ఉద్దేశంతో ఆగారు. అక్కడ దృశ్యాలను చరవాణీలో బంధించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ దిగుతుండగా కాలు జారి ఇద్దరు యువకులు జలాశయంలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
నగరి కుశస్థలినది బుగ్గలో విద్యార్థి గల్లంతు
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని అనంతప నాయుడు కండ్రిగ సమీపంలోని బుగ్గానకట్ట నదిలో చెర్లోకండ్రిగ గ్రామానికి చెందిన సంతోష్ అనే ఇంటర్మీడియట్ విద్యార్ధి గల్లంతు అయ్యాడు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బుగ్గ ప్రవాహంలో శనివారం స్నేహితులతో కలిసి స్నానానికి దిగిన సంతోష్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గల్లంతైన సంతోష్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.