తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దర్ని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న డాక్యా నాయక్‌ నుంచి పేపర్ కొనుగోలు చేసిన కోస్గి భగవంత్‌ కుమార్, కోస్గి రవి కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీళ్ల అరెస్టుతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 22కు చేరింది. 


వికారాబాద్ ఎంపీడీవో ఆఫీస్‌లో కోస్గి భగవంత్‌ పని చేస్తున్నాడు. తన తమ్ముడు రవి కుమార్ కోసం ఏఈ పేపర్‌ కొన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. డాక్యా నాయక్‌ బ్యాంకు అకౌంట్లు పరిశీలించినప్పుడు ఇసలు విషయం వెలుగులోకి వచ్చింది. భగవంత్‌కు డాక్యా నాయక్‌ మధ్య రెండు లక్షల రూపాయల ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు కనిపెట్టారు. దీంతో భగవంత్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన తమ్ముడు రవి కోసమే ఏఈ పేపర్‌ కొన్నట్టు భగవంత్ చెప్పడంతో రవి కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. 


ఈ కేసులో మరింత మంది అనుమానితులను ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది. డాక్యా నాయక్‌ ఇతర నిందితుల బ్యాంకు అకౌంట్లు సెల్‌ఫోన్ డాటా ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నిందితుల మధ్య ఇప్పటి వరకు 33.4 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు అధికారులు  గుర్తించారు. ఈ మొత్తాన్ని డాక్యానాయక్‌కు అందించినట్టు వెల్లడైంది. కొందరు నేరుగా నగదు ఇస్తే మరికొందరు ఆన్‌లైన్ టాన్సాక్షన్స్‌ చేసినట్టు నిర్దారించారు. 


కేసులో పూర్తి వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే... ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కుమార్‌కు 16 లక్షలు రూపాయలు అందాయి. అతను ఏఈ పేర్‌ను రేణుకా రాథోడ్‌కు అమ్మాడు. సోదరుడు రాజేశ్వర్‌ కోసం దీన్ని కొనుగోలు చేసింది.  తర్వాత రాజేశ్వర్‌, డాక్యా నాయక్‌ కలిసి ఆ పేపర్‌ను మరో ఐదుగురికి బేరం పెట్టారు. ఈ ఐదుగురిలో నిలేశ్‌ నాయక్‌ 4.95 లక్షలు, గోపాల్ నాయక్‌ 8 లక్షలు, ప్రశాంత్ రెడ్డి 7.5 లక్షలు, రాజేంద్రకుమార్ 5 లక్షలు, వెంకట జనార్దన్ 1.95 లక్షలు  ఇలా 27.4 లక్షలు ముట్టజెప్పారు. ఇందులో పది లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చారు. 


డీఏవో పేపర్‌ను ఖమ్మంలో ఉంటున్న సాయిలౌకిక్‌, సాయిసుస్మితకు ఆరు లక్షలకు అమ్మాడు ప్రవీణ్. దీంతో రెండు పేపర్లు అమ్మినందుకు ప్రవీణ్‌కు 16 లక్షలు వచ్చాయి. డాక్యానాయక్, రాజేశ్వర్‌కు 17.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు. వచ్చిన డబ్బులతో రాజేశ్వర్‌ కొన్ని కాంట్రాక్ట్ పనులు చేశాడని సిట్ అధికారులు కోర్టుకు తెలియజేశారు. మన్సూర్‌పల్లి తండాలో వీధిలైట్లు ఫిట్ చేయడం, డ్రైనేజీ పనులు పూర్తి చేశాడు. 4.5 లక్షలతో అప్పులు తీర్చాడు. మిగతా ఇద్దరు నిందితులు ప్రవీణ్, డాక్యా నాయక్‌ మాత్రం తమ అమౌంట్‌ను బ్యాంకులోనే ఉంచుకున్నారు. ప్రవీణ్ తన దగ్గర బంధువుకు అప్పుగా కొంత మొత్తాన్ని ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు. 


మరో నిందితుడి రాజశేఖర్‌రెడ్డి కేసులో చాలా భిన్నైందని సిట్ అధికారులు పేర్కొన్నారు. బావ కళ్లల్లో ఆనందం కోసం గ్రూప్‌ 1 పేపర్‌ను ఉచితంగా ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఆయనతోపాటు టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగి అయిన షమీమ్‌కు కూడా ఫ్రీగానే పేపర్ ఇచ్చాడు. ప్రవీణ్ కూడా గ్రూప్‌ 1 పేపర్‌ను సురేష్‌, రమేష్‌కు ఉచితంగా ఇచ్చారు.