వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికి అని, అలాంటిది షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఊరుకుంటామా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన షర్మిల, ఏపీ కాంగ్రెస్‌కి పని చేస్తే తాను స్వాగతిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా పని చేస్తే, సహచర పీసీసీ చీఫ్‌గా ఆమెను కలుస్తానని స్పష్టం చేశారు. తాను ఇక్కడ ఉన్నని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండబోదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమే అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.


కొంతకాలంగా వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు వచ్చాయి. పార్టీ విలీనం తర్వాత టీపీసీసీ చీఫ్‌గా షర్మిలకు బాధ్యతలు ఇస్తారని, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల ఇమేజ్‌ కాంగ్రెస్‌‌కు కలిసివస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అదీకాక వైఎస్ షర్మిల బెంగళూరు వెళ్లి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను కలవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. డీకే శివకుమార్ ద్వారా వైఎస్ షర్మిల మంతనాలు చేస్తున్నారని కూడా విశ్లేషణలు వచ్చాయి. తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజం కాబోదని తేలిపోయింది.


బీఆర్ఎస్ నేతలపైనా విమర్శలు


రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో భారీ భూస్కామ్‌ జరిగిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి తిమ్మాపూర్ భూములను కేటీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. భూస్కామ్‌లో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతలు ఉన్నారని ఆరోపించారు. భూదాన్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. భూస్కామ్‌లో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతలు ఉన్నారని, భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు.


కలెక్టర్లను కేటీఆర్ కీలు బొమ్మలుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి రద్దు చేసి ప్రజలకు ఇబ్బందుల్లేని పాలసీ తెస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత ఏడుపు? అని ప్రశ్నించారు. ధరణి విషయంలో కేసీఆరే పెద్ద దళారీ అన్నారు. తన గ్రామంలోని భూములు అన్యాక్రాంతం అవుతుంటే కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదని ఆయన ప్రశ్నించారు. తిమ్మాపూర్ భూదాన్ భూములపై దర్యాప్తు జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ కు ధరణి బంగారు గుడ్డు పెట్టే బాతులా మారిందని అన్నారు. 30 శాతం కమిషన్ ఇస్తేనే కలెక్టర్లు ధరణి సమస్యలు పరిష్కరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.