KCR in Gadwal District: గద్వాల జిల్లా కలెక్టరేట్ కొత్త భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గద్వాల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను, ఉద్యోగులను, ప్రజలను అభినందిస్తున్నానని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు కనుక పూర్తయితే గద్వాల వజ్రపు తునక, బంగారు తునక అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ రాబోతుందని ఎవరైనా కలగన్నారా అని అన్నారు.
ఈ రోజు దేశంలో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. పర్ క్యాపిట ఇన్‌కంలో, పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్‌లో, ఓడీఎప్ ప్లస్‌లో కూడా నంబర్ వన్‌లో ఉన్నాం. అన్ని రంగాల్లో మంచిగా ఉందని చెప్పి రిలాక్స్ అయిపోతే మనం పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, మరో ఐదు పదేళ్లు ఇలాగే కష్టపడి పని చేస్తే మనల్ని బీట్ చేసేవాళ్లు ఎవరూ రారు. వరి ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్‌ను అధిగమించాం. మనం నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. గద్వాలకు మెడికల్ కాలేజీ రాబోతుంది.
పాత పాలమూరు జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నామా? ఇది సాధ్యమైంది. పట్టు వీడకుండా ఇదే పట్టుదలతో ముందుకు పోతే ఇంకెన్నో విజయాలు సాధిస్తాం. ఐటీ రంగంలో కూడా ముందు వరుసలో ఉన్నం. 2014కు ముందు 54 వేల కోట్ల ఐటీ ఎగుమతులు హైదరాబాద్ నుంచి ఉంటే, ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లకు పైన ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయని నాస్కామ్ వివరించింది. పరిశ్రమలు, పెట్టుబడులు బాగా వస్తున్నాయి’’ అని కేసీఆర్ అన్నారు.
అన్నింటికి మించి ఉద్యమ సమయంలో ఇదే గద్వాలలోని నడిగడ్డకు వచ్చినప్పుడు.. ఓ ఊరికి వెళ్లాను. రెండు నదుల మధ్య ఉన్న నడిగడ్డకు నీళ్లు రావట్లేదు. అందుకోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి చేసుకుంటున్నాం. అన్ని నీళ్ల ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నాం. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే అసలు గద్వాల వజ్రపు, బంగారు తునక అవుతుంది. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్‌ను మళ్లీ సాధించుకున్నాం. అలంపూర్ కూడా అద్భుతంగా తయారు కాబోతుంది. రాబోయే రోజుల్ల ఇంకా సాధించాల్సి ఉంది. ప్రభుత్వంలో మీరు చాలా ఏళ్లు పని చేస్తున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాం’’ అని కేసీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.
సోమవారం (జూన్ 12) జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛరణాల మధ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాల్ జిల్లా పార్టీ ఇంచార్జి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చొబెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అంబ్రహం, తదితరులు పాల్గొన్నారు.