రవితేజ, అనుపమా పరమేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ టైటిల్‌ను సోమవారం ప్రకటించారు. ఈ మూవీకి ‘ఈగల్’ టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు.. టైటిల్‌తోపాటు మూవీపై ఆసక్తికలిగించే ఒక చిన్న టీజర్‌ను కూడా శాంపిల్‌గా వదిలారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చి ‘ధమాకా’ మూవీ ఎంత పెద్ద హిట్ కొట్టిందో తెలిసిందే. అంతేకాదు, రవితేజ కెరీర్‌లో రూ.100 కోట్లను సాధించిన చిత్రంగా నిలిచింది.


ఈ మూవీలో ఇంకా నవదీప్, మధుబాల, కావ్యథాపర్ సైతం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ విషయానికి వస్తే.. ఒక పెయింటర్ గురించి రా ఏజెంట్స్ అవసరాల శ్రీనివాస్, మధుబాల  గాలిస్తున్నట్లు చూపించారు. అయితే, అతడు పెయింటర్ కాదని, పత్తి పండించే రైతని, రోజంతా పంటు గురించే ఆలోచన అంటూ మరో పాత్రతో రవితేజ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. ‘‘కొంతమంది చూపు.. మనిషి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు’’ అంటూ నవదీప్ డైలాగ్‌తో రవితేజ పాత్రపై మరింత ఆసక్తికలిగించారు. ‘‘ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటీ? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటీ?’’ అనే అనుపమా పరమేశ్వరన్ డైలాగ్‌తో మూవీ టైటిల్‌ను ‘ఈగల్’ను రివీల్ చేశారు. ‘‘ఆ చూపే మరణం.. ఆ అడుగే సమరం..’’ అంటూ టీజర్ ముగిసింది. 



ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని స్టోరీ, స్క్రీన్‌ప్లై, దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కుచిబొట్ల నిర్మాతలు. ద్వజాంద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని 2014 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు. 






వరుస సినిమాలతో రవితేజ బిజీ బిజీ:


ఇటీవలే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ పోస్టర్‌ను గోదావరి రైల్వే బ్రిడ్జి మీద భారీ స్థాయిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘టైగర్ నాగేశ్వరావు’, ‘ఈగల్’ మూవీలతోపాటు రవితేజ మరో సినిమాలో కూడా నటిస్తు్న్నట్లు తెలిసింది. ఆ మూవీలో హీరో శర్వానంద కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిరపకాయ్' సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రవితేజ పాఠాలు చెబుతూ కనిపించారు. అందులో ఆయనది పోలీస్ రోల్. అయితే, ఓ మిషన్ మీద కాలేజీకి వెళ్లి లెక్చరర్ గా పాఠాలు చెప్పారు. 'మిరపకాయ్' తర్వాత రవితేజ లెక్చరర్ రోల్ చేయడం ఇదే. ఈసారి ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. రవితేజకు శిష్యుడిగా స్టూడెంట్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తారని సమాచారం. గురు శిష్యుల మధ్య బంధం కథలో కీలకమైన అంశం అట. వాళ్ళ రిలేషన్, ఎమోషన్, మనస్పర్థలు వంటివి హైలైట్ చేస్తూ సందీప్ రాజ్ కథ రాశారట.


Read Also : రికార్డుల వేటకు మళ్లీ ఒక్కటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా!