New fficial symbol of Telangana : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త అధికారిక చిహ్నాన్ని ఖరారు చేయనుంది.  కొత్త చిహ్నం రూపొందించడంలో రూపకర్త రుద్ర రాజేశం అండ్ కో బిజీగా ఉంది. వారు సిద్ధం చేసిన కొన్ని లోగోలను సీఎం రేవంత్ రెడ్డి పరిశిలించారు.  అందులో ఒకదానిని సెలక్ట్ చేసి కొన్ని మార్పు చేర్పులు సూచించినట్లుగా తెలు్సతోంది.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరిసేలా 40కి డిజైన్లు రూపొందించారు.  


డిజైన్లను ఫైనల్ చేసే పనిలో రేవంత్ రెడ్డి                                        


గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖరారు చేసిన లోగో రాచరిక పోకడలతో ఉందని..  అమరుల త్యాగాలు ఎత్తిపట్టేలా తెలంగాణ చిహ్నం ఉండాలని రేవంత్ నిర్ణయించారు.  తెలంగాణ కోసం బిడ్డలు ప్రాణ త్యాగం చేశారని.  వారి త్యాగాలు ఉట్టిపడేలా చిహ్నం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి రుద్ర రాజేశంకు సూచించారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా లోగోను ఖరారు చేయనున్నారు.  తెలంగాణ చిహ్నం చూశాక ప్రజలు తప్పకుండా సంతోషిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  


రాచరికపు పోకడలు లేకుండా కొత్త చిహ్నం                                               


రేవంత్ రెడ్డి మొదటి నుంచి తెలంగాణ చిహ్నం మారుస్తామని చెబుతున్నారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలని.. ఇక్కడ రాచరిక ఆనవాళ్లకు చోటు లేదని చెప్పారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం కూడా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్​కు చెందిన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిప్సిపల్​కు రాజముద్ర రూపకల్పన బాధ్యతల్ని అప్పగించామని రేవంత్ పేర్కొన్నారు. సమ్మక్క-సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నాన్ని తయారు చేస్తున్నామని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. 


ప్రజలతో కలిసి ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించిన కేటీఆర్                                                              


తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమైన చార్మినార్, రామప్ప దేవాలయం, కాకతీయ తోరణంను  రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించడంపై కేటీఆర్ విరుచుకుపడుతున్నారు.  రాచరికపు గుర్తులు ఉన్నాయంటూ తొలగించారని, కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలాంటి చిహ్నాలు ఉన్నాయన్నారు. వాటినీ తొలగిస్తారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే రాష్ట్ర చరిత్రను చెరిపేయడం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే  అంటున్నారు.  తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.