Hyper Aadi Speech At Gangs of Godavari Pre Release Event: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సినిమాలో హైపర్ ఆది కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రీ రీలీజ్ ఈవెంట్ లో ఆది పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. తన మాటలతో బాలకృష్ణను కూడా ఫిదా చేశాడు ఆది. నందమూరి రామారావు గురించి, బాలకృష్ణ గురించి, సినిమాల గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ గారిని స్మరించడం నా అదృష్టం..
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ ని సీనియర్ ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ మొదలుపెట్టాడు ఆది. ఆయన 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఇక ఆది మాట్లాడుతూ... "హనుమంతుడు ఉన్నచోట జై హనుమాన్ అని పని మొదలుపెడతాం. శ్రీరాముడు ఉన్న చోట జై శ్రీరామ్ అని మన పని మొదలుపెడతాం. అలానే బాలయ్య బాబు గారు ఉన్నచోట జై బాలయ్య అన్న తర్వాతే మన పని మొదలు పెట్టాలి కదా... జై బాలయ్య. బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకరి గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలో ఏ మూల ఉన్న నేను తెలుగు వాడిని అని గర్వంగా, ధైర్యంగా చెప్పుకుంటున్నాం అంటే ఆ గర్వం పేరు, ఆ ధైర్యం పేరు నందమూరి తారక రామారావు గారు. శ్రీరాముడు శ్రీ కృష్ణుడు ఎలా ఉంటారో తెలీదు. కానీ, రామారావు గారు ఆ పాత్రలు వేసినప్పటి నుంచి శ్రీకృష్ణుడిగా ఆయన ఫొటోలే ఇంట్లో పెట్టాం, శ్రీరాముడిగా ఆయన్నే పూజించాం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగాను. బొబ్బిలి పులి అనే సినిమాలో చివర్లో కోర్టు సీన్ ఒక్కటి చూస్తే చాలు. ఆయన గాంభీర్యం, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్. అలాంటి నటులు, అలాంటి నాయకులు మళ్లీ పుట్టరు. అలాంటి నాయకుడిని ఆయన 101వ జయంతి రోజున స్మరించుకోవడం, అది కూడా బాలకృష్ణ గారి ముందు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు హైపర్ ఆది.
తెలుగు జాతి గౌరవాన్ని కాపాడుతున్నారు..
"తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే... రామారావు గారి గౌరవాన్ని ఆయన వారసుడిగా ఒక పక్క దమ్మున్న సినిమాలు చేస్తూ, మరో వైపు నిజాయితీ గల రాజకీయనాయకుడిగా కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఎవరినో కొట్టారు, ఎవరినో తిట్టారు అని రాస్తుంటారు కానీ, ఆయన కొన్ని వేలమంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు. సినిమాలు రాజకీయాలు చేయడం పెద్ద విషయం కాదు. కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదవారికి సహాయం చేయడం చాలా గొప్ప విషయం. రామారావు గారి తర్వాత పంచకట్టులో అందంగా కనిపించే హీరో బాలకృష్ణ గారు."
అన్ స్టాపబుల్..
"ఒక జనరేషన్ వాళ్లు గుర్తిండిపోయే సినిమాలు అడిగారు.. ఆదిత్య 369, భైరవద్వీపం ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్లు తొడలు కొట్టేసినిమా కావాలంటే.. నరసింహనాయుడు, సమర సింహారెడ్డి ఇచ్చారు. కాలర్ ఎగరేసే సినిమా కావాలంటే సింహ సినిమా ఇచ్చారు. మీసం తిప్పే సినిమా కావాలంటే.. లెజండ్, అఖండ, భగవంత్ కేసరి లాంటి సినిమా ఇచ్చారు. జనరేషన్లు మారినా బాలయ్య గారి ఎనర్జీ మారదు. జనరేషన్లు మారితే మనుషులు మారతారు, టెక్నాలజీలు మారతాయి, బాలయ్య బాబు మారడం ఏంటిరా బ్లడీ ఫూల్ అని చెప్పండి. సినిమాల్లో అన్ స్టాపబుల్, ఓటీటీల్లో అన్ స్టాపబుల్, రాజకీయాల్లో అన్ స్టాపబుల్, సేవ చేయడంలో అన్ స్టాపబుల్, అనవసరంగా దూరిన వారిని కొట్టడంలో అన్ స్టాపబుల్, అవసరం అని అడిగిన వారికి పెట్టడంలో అన్ స్టాపబుల్ బాలయ్యబాబుగారు. అలాంటి మా బాలయ్య బాబు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఈవెంట్ కి రావడం మా సినిమా కలెక్షన్లు కూడా అన్ స్టాపబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను."
నందమూరి నట సింహం, కొణిదెల కొదమ సింహం..
"మా సినిమా ఎలా ఉండబోతుందంటే... పది నిమిషాలకు క్లోజ్ అయ్యే బొమ్మ ముందు జై బాలయ్య అనే స్లోగన్స్ వస్తే ఎంత కిక్ ఇస్తుందో మా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాక కూడా అంతే కిక్ ఇస్తుంది. బాలకృష్ణ గారు చేతిలో మైక్ పట్టుకుని స్టైల్ గా తిప్పితే ఎంత కిక్ వస్తుందో మా సినిమా చూస్తే అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారు ఫోన్ స్టైల్ గా విసిరేస్తే మీకు ఎంత కిక్ వస్తుందో ఈ సినిమా అంత కిక్ ఇస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంత కిక్ ఇస్తుంది. ఒక్క విషయం బాలయ్య గారి పర్మిషన్ తో చెప్పాలనుకుంటున్నాను. రేపు పొద్దున్న నందమూరి నట సింహం, కొణిదెల కొదమ సింహం అసెంబ్లీలో అడుగుపెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ ఇస్తుంది. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి" అని ఆది చెప్పిన వెంటనే హాల్ మొత్తం కేరింతలతో మారు మోగిపోయింది.
విశ్వక్ సేన్ తో చేస్తే లాభాలే..
సినిమా గురించి మాట్లాడుతూ.. కచ్చితంగా హిట్ అవుతుందని అని అన్నారు హైపర్ ఆది. విశ్వక్ సేన్ అనే 28 ఏళ్ల కుర్రాడు టాలెంటెడ్ అని, ఆయన సినిమా చేస్తే లాభాలే తప్ప నష్టాలు ఉండవు అని చెప్పారు. ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించారని చెప్పారు. సినిమాలో కుప్పలు కుప్పలుగా డైలాగులు ఉన్నాయని, డైరెక్టర్ కమ్ రైటర్ కృష్ణ చైతన్య అంత బాగా రాశారని చెప్పారు ఆది. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కూడా అద్భుతంగా నటించారని అన్నారు ఆది. రివ్యూలు రాసేటప్పుడు ప్రొడ్యూసర్లను దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమాని బతికించాలని కోరారు ఆది. చివర్లో ఒక బాలయ్య బాబు డైలాగ్ చెప్పి తన పవర్ ఫుల్ స్పీచ్ ని ముగించాడు హైపర్ ఆది.
Also Read: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు - నన్ను ఇన్‌స్పరేషన్‌గా తీసుకోవద్దని చెప్పా...