Telangana CM Revanth:   బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించకుండా అడ్డుకుంటోందని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కోసం అపాయింట్‌మెంట్ కోరినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒత్తిడి కారణంగా అది దక్కలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ అంశంపై  మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకకపోవడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనన్నారు.  బీజేపీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అన్యాయం చేస్తోందని, రిజర్వేషన్ల విషయంలో వితండవాదం చేస్తోందని విమర్శించారు. 

తెలంగాణలో నిర్వహించిన కులగణన సంపూర్ణమైన మరియు పారదర్శకమైన విధానంలో జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లోపభూయిష్టంగా జరిగిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.  కులగణనలో 66.39 లక్షల గ్రామీణ ఇళ్లు,  45.15 లక్షల పట్టణ  ఇళ్ల నుంచి  డేటా సేకరించామన్నారు.  ఈ గణన ఫలితాల ప్రకారం, బీసీలు ముస్లిం బీసీలు మినహా  46.2 శాతం, ముస్లిం బీసీలతో కలిపితే 56 శాతం జనాభాను కలిగి ఉన్నారని తేలిందన్నారు.ఈ డేటా ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ ధర్నాకు రాహుల్ గాంధీ ,  మల్లికార్జున్ ఖర్గే హాజరు కాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీ..ఇటీవలే తండ్రిని కోల్పోయిన హేమంత్ సోరెన్ ను పరామర్శించడానికి వెళ్లారని అన్నారు.  కిషన్ రెడ్డి “గల్లీ లీడర్”లా మాట్లాడటం సరికాదని, కులగణన సర్వే గురించి ఆయనకు అనుమానాలు ఉంటే, డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చేస్తే అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తారని సవాల్ విసిరారు.

 బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్  శిఖండి పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జంతర్ మంతర్ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనకపోవడమే కాక, అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతంగా పరిమితం చేసిన చట్టాన్ని రూపొందించిందని, దాన్ని అధిగమించేందుకే తాము ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో  100 మందికి పైగా ఎంపీలు, అలాగే డీఎంకే, ఎన్సీపీ, సమాజవాదీ పార్టీ, లెఫ్ట్ పార్టీలు వంటి ఇండియా కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాయని రేవంత్ తెలిపారు. వారందరికీ ధన్యవాదాలుతెలిపారు. 

 రాష్ట్రపతి ఆమోదం ఆలస్యమైతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లులు ఆమోదం పొందకపోతే, బీజేపీ వెనుకబాటు తరగతులకు వ్యతిరేకమని నిరూపితమవుతుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ నాయకుడు ఎన్. రామచందర్ రావు 42 శాతం ఓబీసీ రిజర్వేషన్‌ను సమర్థిస్తూనే, అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల పేరుతో బీసీ కోటాను అడ్డుకుంటోందని ఆరోపించారు.