Telangana Assembly Resolution :  కేంద్ర బడ్జెట్‌’పై తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.  బీజేపీ మినహా అన్ని  పార్టీలు ఈ తీర్మానంపై తమ అభిప్రాయాలను తెలిపాయి.  బీజేపీ మాత్రమే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.   కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణపట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తీర్మానంలో పేర్కొన్నారు.  బడ్జెట్‌ను సవరించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఈ తీర్మానం ద్వారా కేంద్రాన్ని శాసనసభ కోరింది.           


రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు చేసిన డిమాండ్‌పై కూడా రేవంత్‌ స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధమని ప్రకటిస్తామన్నారు. విపక్ష నేతగా కేసీఆర్‌ వస్తే.. ప్రభుత్వాధినేతగా తాను వస్తానని చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసం కేసీఆర్ ముందుకు రావాలన్నారు. మీరు తేదీ నిర్ణయించండి.. మేము దీక్షకు సిద్ధమని ప్రకటించారు.  ప్రధానిని ఎన్నో అడిగాం.. ఒక్కటీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క  అసంతృప్తి వ్యక్తం చేశారు.  మా ప్రతిపాదనలు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ దేశంలో భాగం కాదా? ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించిందన్నారు.   కేంద్రం తీరుతో రాష్ట్రాలన్నీ ఆలోచనలో పడ్డాయి. తెలంగాణను కేంద్రం గాలికి వదిలేసిందన్నారు.            
 
ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాకూడదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు. రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశాం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం అని అసెంబ్లీలో ప్రకటించారు.                            


నీతి ఆయోగ్ సమావేశాన్ని ఇతర సీఎంలు కూడా బరిష్కరించారు.   తమిళనాడు సీఎం స్టాలిన్‌ , కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుఖు నీతి ఆయోగ్‌ మీటింగ్‌కు హాజరు కావడం లేదు.   తమ పార్టీ ముఖ్యమంత్రులు ముగ్గురు ఈ సమావేశానికి హాజరు కారని  కాంగ్రెస్ ఢిల్లీలో ప్రకటించింది. బడ్జెట్‌లో కేంద్రం చూపిన వైఖరిపై బెంగాల్‌, కేరళ ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. వారు నీతి ఆయోగ్‌ సమావేశానికి గైర్హాజర్ అయ్యే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.