Republic Day 2023: భద్రకాళి బండ్ పై జీడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 అడుగుల  జాతీయ జెండాను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్ లు ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. 





ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము..


ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన దేశంలోనే అమలవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అందరి హక్కులను పొందుపరిచడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆనాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీయ మార్గంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. కొట్లాడి సాధించిన తెలంగాణలో  అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు అవుతోందని... అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోషకాలతో కూడిన పౌష్ఠికాహారం, విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా  ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి వారికి వారికి పెళ్లయ్యేదాకా ప్రభుత్వం ఆడ పిల్లలకు అండంగా ఉంటుందని వివరించారు. కార్పొరేషన్ అధ్వర్యంలో ప్రతి కాలనీలో ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పంచడానికి  పిల్లలకు, పార్క్ లు, పెద్దలకు వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసిన ఘనత పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కే దక్కిందని చీఫ్ విప్ కొనియాడారు.




అంబేడ్కర్ స్పూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం..


ఇటీవల జాతీయ భావన, దేశ భక్తిని పెంపొందించేలా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని నగర మేయర్  గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బంగారు తెలంగాణ దిశగా ముందుకెళుతున్నారని అన్నారు. కేసీఆర్ సాధించిన తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనేక వినూత్న పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు. కేవలం పక్షం రోజుల స్వల్ప కాల వ్యవధిలో 150 అడుగుల పోల్ తో 48/32 సైజ్ తో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసిన బల్దియా అధికారులు, నిర్వహకులకు, కాంట్రాక్టర్లను మేయర్ అభినందించారు.




అబ్బుర పరిచిన ప్లాస్టిక్ న్నత్యం..


లయోలా పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేసిన నృత్యం... ప్రజలందిరనీ చైతన్యపరిచే విధంగా ఉంది. నృత్యం ప్రదర్శన చేసిన చిన్నారులను, పాఠశాల యాజమాన్యాన్ని చీఫ్ విప్, మేయర్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బల్దియా అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు