Republic Day 2023:  74వ గణతంత్ర దినోత్సవాన్ని యావత్ భారత దేశం ఘనంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందిరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 26వ తదీ దేశ పౌరులందరికీ చాలా ముఖ్యమైన రోజు అని అన్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచే దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. స్వాతంత్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు మనం ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత ప్రత్యేకం అని న్నారు. ఎందుకంటే ఆజాదీకా అమృత్ మహోత్సవం వేళ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ వివరించారు. 






 


ఈ ఏడు గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకత ఏమిటి?


ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వం వహించగా.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కవాతులో ప్రదర్శించే ఆయుధాలన్నీ మేడ్ ఇన్ ఇండియా పరికరాలు అని అధికారులు వివరించారు. వీటి వల్ల దేశ స్థాయి మరింత పెరగబోతోందన్నారు. ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్, నాగ్ మిస్సైల్ సిస్టమ్ (నామీస్), కె-9 వజ్రలను కూడా ప్రదర్శించారు. లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ నేతృత్వంలోని 144 మంది యువ నావికులు భారత నావికాదళ బృందంలో ఉన్నారు.  


అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు 


ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం సందర్శనతో గణతంత్ర వేడుకలు ప్రారంభం అయ్యాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. దేశ సేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నుంచి రాజ్ పథ్ చేరుకున్న ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు.