Pawan Kalyan :  రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర వాదం.. ఉత్తరాంధ్రలో ప్రత్యేక ఉత్తరాంధ్ర వాదం వినిపిస్తున్న  నాయకులకు పవన్ కల్యాణ్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు.  వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని హెచ్చరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి తనదైన శైలిలో పవర్  ఫుల్ స్పీచ్ ఇచ్చారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో విసిగిపోయామన్నారు.  మీ బతుకులకేం తెలుసు? కాన్‌స్టిట్యూషన్‌ అసెంబ్లీ డిబేట్స్‌ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్‌ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? అని మండిపడ్డారు.  మేం దేశ భక్తులం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపేయండని స్పష్టం చేశారు. 


ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కొల్లగొట్టారు ! 


‘‘ప్రజల కోసమే జనసేన కార్యాలయం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా జనసేన ఆఫీస్‌కు రావచ్చు. వారాహిని రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. అడ్డుకుంటాం, అనుమతివ్వం అని మాట్లాడారు. నేను కోడి కత్తితో పొడిపించుకుని రాలేదు. చట్ట ప్రకారం వారాహికి అన్ని అనుమతులు తీసుకున్నా. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో సహా వేల కోట్లు కాజేశారు. దోచుకున్న మీరే ఇలా ఉంటే.. నిజాయితీగా ఉన్న మాకెంత ఉండాలి? అని ప్రశ్నించారు. ప్రధానిని కలిస్తే ఈసారి సజ్జల, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తా. మంత్రి ఇల్లు తగులపెట్టించుకున్నా సీఎం వెళ్లలేదు. ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి వెళ్లలేదు. బాబాయిని చంపేసి కేసును సీబీఐకు ఇవ్వమనడం ఏమిటి?.’’ అని పవన్ ప్రశ్నించారు.


ప్రజాస్వామ్యం సజ్జల సొంతం కాదన్న పవన్ కల్యాణ్ 


ప్రజల కోసం త్వరలోనే వారాహి యాత్ర చేపడతా. ప్రజాస్వామ్యం అనేది సజ్జల సొంతం కాదు.. జగన్ సొంతం కాదు. కులాల మధ్య అంతరాన్ని కొంతమంది పెంచి పోషిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారు. వైసీపీది దేశీయ దొరతనం. నేను చట్టాలను గౌరవిస్తానని పవన్ స్పష్టం చేశారు.  సీఎం జగన్ తీరుపై పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు.  జగన్ టీనేజ్ లో ఉన్నప్పుడు కడపలోని పులివెందులలో ఓ ఎస్సైని జైల్లో పెట్టి కొట్టారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి చేతుల్లో ఇప్పుడు   లా అండ్ ఆర్డర్ జగన్ చేతుల్లో ఉందన్నారు. 


ప్రజల అవసరాల కోసం మారతా.. విధానాలు మార్చుకుంటానన్న పవన్ కల్యాణ్ 


పొత్తుల విషయంలో తనపై వస్తున్న విమర్శలకూ పవన్ స్పందించారు. ‘అవసరానికి నీ ఎజెండా మార్చేస్తావు అని మాట్లాడుతున్నారు. ప్రజల అవసరాల కోసం నేను మారతా.. నా విధానాలు మార్చుకుంటా. అన్ని కులాలను అనుసంధానం చేసే నాయకత్వం అవసరం. మార్కిస్ట్, కమ్యూనిస్టు కాదు.. నేను హ్యూమనిస్టు. ఎప్పుడూ కొన్ని కులాలకే అధికారమా? ఇది సమంజసమా? అని ప్రశ్నించారు.