Renuka Chowdhury: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (CM KCR) అధికార మదంతో విర్రవిగుతున్నారని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Choudhary) మండిపడ్డారు. గురువారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ ప్రయోజనం కోసం కాదన్నారు. విభజన నాటికి మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ తన 9 ఏళ్ల పాలనలో అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ప్రతి మనిషిపై BRS పార్టీ లక్షకు పైగా అప్పు భారం వేసిందన్నారు. 



కల్తీ విత్తనాలను అడ్డుకున్నారా?
కల్తీ, దొంగ విత్తనాలు రైతులను నాశనం చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. కల్తీ విత్తనాల కారణంగా రాష్ట్రంలో 8 వేల మంది రైతు కుటుంబాలు నాశనం అయ్యాయని, వీటిపై కేసీఆర్ నోరు కూడా మేదపలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతుని మర్చిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు దృష్టిలో పెట్టుకుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా బంగారం అంతా కేసీఆర్ ఇంటికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పక్కన పెట్టి గెలిపిస్తే రైతులకు కేసీఆర్ చేసింది ఏంటని ప్రశ్నించారు? 


కాళేశ్వరం క్వాలిటీ కంట్రోల్ ఏమైంది
ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా.? అంటూ రేణుకా చౌదరి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ కంట్రోల్ ఏమైందని, కాళేశ్వరం భవిష్యత్ ఏంటని నిలదీశారు. ప్రాజెక్టు పక్కన ఊరు ప్రజల గురించి ఏనాడైనా కేసీఆర్ ఆలోచించారా అని అడిగారు. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, పంటకు గిట్టుబాటు ధర అడిగిన రైతులను జైలుకు పంపిందన్నారు.


బీఆర్ఎస్ నేతలు చదువుకుని ఉంటే బాగుండేది
రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆమె విమర్శించారు. ప్రశ్నించే కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. ఈ పోర్టల్ సామాన్యుడికి మేలు జరిగిందా ఆలోచించాలని అన్నారు. కేజీ టూ పీజీ అన్నారని, BRS నేతలు చదువుకుంటే బాగుండేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ అని ఒప్పుకొని కేసీఆర్ చెంపలు వేసుకోవాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.


సీట్ల కేటాయింపుపై అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఇటీవల రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క‌మ్మ లీడ‌ర్లు అంటే అంత లోకువ‌నా..? వారిని అంత త‌క్కువ అంచ‌నా వేస్తున్నారా..? అని ప్రశ్నించారు. అంటే ఏదో పిల్లికి భిక్షం పెట్టిన‌ట్లు నాలుగు బిస్కెట్లు ఏసేస్తే క‌మ్మ నాయ‌కులు ఊరుకుంటారా..? మీకు సీట్లు, ఆర్థికంగా కూడా చూసుకుంటామ‌ని ఇత‌ర పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, ఆ ప‌ని ఎందుకు కాంగ్రెస్ చేయ‌లేక‌పోతుంద‌ని ఆమె నిలదీశారు. 


పార్టీ టికెట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని రేణుకా చౌద‌రి ఆరోపించారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని.. కమ్మ కులాన్ని కూడా గుర్తించాలని డిమాండ్ చేశారు. కమ్మ కులస్తుల మనోభావాల్ని పరిగణలో తీసుకోవాలని హైకమాండ్‌ను కోరినట్లు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా కమ్మ కులస్తులు ఆగ్రహంగా ఉన్నారని ఆమె అన్నారు.