MLA Varaprasad Rao: తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు నివాసం పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గూడూరు పట్టణ సొసైటీలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు నివాసం ఉంటున్నారు. బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి ఆవరణలోని కుర్చీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంతేకాదు ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. వరండాలోని టేబుల్, ఫ్యాన్ పగలగొట్టారు. అర్ధరాత్రి ఇంటి బయట శబ్ధాలు రావడంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
ఆ సమయంలో ఇంట్లో పనిచేసే మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఆగంతకులు పరారయ్యారు. పని మనిసి ఒక ఆగంతకుడిని చూసినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఘటనకు పార్టీలో గ్రూపు రాజకీయాలే కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా గూడూరు వైసీపీలో తీవ్ర విభేదాలు తలెత్తాయి.
ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు ఒక వర్గంగా, మిగిలిన వారు వేరే వర్గంగా విడిపోయారు. ఒకరంటే ఒకరికి పడకుండా రాజకీయం చేస్తున్నారు. ఈ వర్గ పోరు నేపథ్యంలోనే వెలగపల్లి వరప్రసాద్ రావు నివాసంపై దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యేకు చిక్కులు
గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ కి రాజకీయంగా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయని ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి వరప్రసాద్ రావు తనకంటూ ప్రత్యేక అజెండా పెట్టుకుని పనిచేస్తారనే పేరుంది. ఆయన పైకి సౌమ్యంగానే ఉన్నా లోలోన మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన నియోజకర్గంలో అగ్రవర్ణాల పెత్తనంపై ఒకింత ద్వేష భావం చూపిస్తున్నా రనే విమర్శలు కూడా ఉన్నాయి.
గతంలో తిరుపతి ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజూ వెళ్లి వెంకన్నకు మొక్కకపోతే.. మరే పనీలేదా మీకు? అని ఆయన గతంలో అగ్రవర్ణ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ అగ్ర నేతలు సీఎం జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే వర్గం, అగ్ర వర్గాల నేతలు చీలిపోయి గూడూరులో వైసీపీ రాజకీయాలను నడుపుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎవరితోనూ కలివిడిగా ఉండడం లేదని అంటున్నారు వైసీపీ నాయకులు.
కొద్ది కాలం క్రితం ఎమ్మెల్యే తీరుపై వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. గూడూరు ఎస్సీ నియోజకవర్గమే అయినా ఇక్కడ కూడా అగ్రవర్ణాల వారు ఉన్నారని, వారి ఓట్లతోనే మీరు ఎమ్మెల్యే అయ్యారనే విషయం మరిచిపోవద్దంటూ ఎమ్మెల్యేకు హితవు పలికారు. అదే సమయంలో సీఎం జగన్‌పైనా ఎమ్మెల్యే వరప్రసాద్ విమర్శలు చేశారని స్థానిక వైసీపీ నాయకులు ఆరోపించారు. సీఎం తనకు స్వేచ్ఛను ఇవ్వడం లేదని, ఇస్తే తన సత్తా చూపిస్తానని, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో మరింత ఆజ్యం పోశాయి. దీనిపై వైసీపీ నాయకులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.