Rangareddy News : ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థిని పాము కాటుకు గురైంది.  దీంతో తోటి విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాలలో అపరిశుభ్ర పరిసరాల కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు చెత్త చెదరంతో నిండి పోయాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.



టాయిలెట్స్ లో అపరిశుభ్రత 


రంగారెడ్డి జిల్లా చౌదరి గూడ మండలం పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి విద్యార్థిని పాము కాటు గురైన సంఘటన కలకలం రేపింది. టాయిలెట్ కు వెళ్లిన విద్యార్థినిని పాము మూడు కాట్లు వేసింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.  ఆ పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణం,  టాయిలెట్లు చెత్తతో నిండిపోయాయని అంటున్నారు. టాయిలెట్లు దుర్గంధం, దుర్వాసన కొడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చికిత్స కోసం విద్యార్థిని అక్షితను  ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు పామును కొట్టిచంపారు. ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. 


ఒక్క కాటుతో 100 మంది చంపగల పాము! 


 ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. అయితే విష సర్పాలంటే మనకు ముందుగా.. నాగు పాము, కట్ల పాము, నల్ల త్రాచు, రక్త పింజర పాములు గుర్తుకొస్తాయి. ఇలాంటి ప్రమాదకరమైన పాములు దేశం మొత్తం మీద సుమారు 200 వందలకు పైగా ఉన్నాయి. ఇవి కాటు వేస్తే.. సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయి. కానీ ఇంతకన్న ప్రమాదకరమైన పాములు ప్రపంచంలో ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రమాదకరమైన పాముకు సంబంధించిన ఓ వార్తే ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తోంది. ఆ పాము ఒక్కసారి కాటు వేస్తే విడుదలయ్యే విష ప్రభావం దాదాపు 100 మందిని చంపేయగలదట. ఇంతకీ ఆ పాము ఏమిటీ? ఎక్కడ నివసిస్తోంది? 


తైపాన్ పాము 


ఆస్ట్రేలియాలో మాత్రమే ఉండే ఇన్‌ల్యాండ్‌ తైపాన్‌ అనే జాతికి చెందిన ప్రమాదకరమైన పాము.. ఒక్క సరి కాటు వేస్తే సుమారు వందమంది చనిపోతారట. దీని ఆకృతి కూడా మిగతా పాముల కంటే భిన్నంగా ఉంటుందట. అయితే ఈ పాము కేవలం ఉదయం సమయంలోనే చాలా హైపర్‌ యాక్టివ్‌ ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌, స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ నిపుణులు వెల్లడించారు. వీటి కోరలు సుమారు 3.5 నుంచి 6.2 మిల్లిమీటర్లు పొడవు ఉంటాయంటా.  తైపాన్‌ పాముకు ఇంకో టాలెంట్‌ కూడా ఉంది. అదే రంగులు మార్చడం. అవును, మీరు చదివింది అక్షరాల నిజం. రుతువులను బట్టి.. ఈ పాము చర్మం రంగును ఈజీగా మార్చుకుంటుందని వెల్లడించారు సైంటిస్టులు. శీతాకాలంలో ముదురు గోధుమ రంగులో ఉండే ఈ పాము.. వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తుందట. ఇది ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుందట. ఆ విషంతో 100 మందికి పైగా వ్యక్తులను, లేదా 2.50 లక్షల ఎలుకలను చంపొచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇక పగటిపూట ఇవి కనిపించడం చాలా తక్కువ అని తెలిపారు. ఈ పాముల ప్రధాన ఆహారం కోడి పిల్లలు, ఎలుకలను మాత్రమే తింటాయట. ఉదయం సమయంలో మాత్రమే నేలపై ఉండి.. రాత్రి సమయంలో పెద్దపెద్ద రాళ్ల మధ్య ఉంటాయని తెలిపారు. అయితే ఈ ప్రపంచంలో దాదాపు 600 విషపూరిత పాములు ఉన్నప్పటికి.. కేవలం అత్యంత విషపూరితమైన పాములు దాదాపు 200 వరకు ఉన్నాయి. ఈ 200 పాముల్లోనే అత్యంత డేంజర్‌ పాము ఇదేనని తెలిపారు.