BRS Party: దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాల నాయకులు చాలా మంది తమ పార్టీలో చేరుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు మహిళలను, బతుకమ్మను కూడా అహేళన చేస్తూ మాట్లాడన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్ తన గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం బాధాకరం అన్నారు. ప్రజలంతా వీటిని చూస్తున్నారని.. సరైన సమయంలో వాళ్లే బీజేపీకి బుద్ధి చెబుతారని చెప్పుకచ్చారు. బీఆర్ఎస్ ఏర్పాటు వల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందంటూ ఎద్దేవా చేశారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేసి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా వ్యూహాలను రచిస్తామన్నారు.
భారత్ జాగృతి ద్వారా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు
దేశంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అవినీతి గురించి అందరికీ తెలుసునని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వాళ్లు ఏం చేసినా బీజేపీకి భయపడే అవకాశమే లేదని చెప్పారు. భారత్ జాగృతి ద్వారా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి యథావిధిగా కొనసాగుతుందని ఏపీలో ఎన్నికలకు సమయం ఉన్నందున ఇంకా అక్కడ తమ వ్యూహాలు ఆలోచించలేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని వివరించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ప్రచారం చేసి మరీ అతడి ఓడిస్తానని పేర్కొన్నారు.
దేశంలో ఉన్న సమస్యలపై భారత్ జాగృతి పోరాటం..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను ఏకం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని జాగృతి కాపాడుతోందన్నారు. జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ జాగృతికి జయశంకర్ సార్, కేసీఆర్ లు గురువులన్నారు. 8 ఏళ్లలో పరిపుష్టమైన కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. ఆనాడు బతుకమ్మను ఎత్తుకోవాలంటే సిగ్గుపడ్డారన్నారు. మన కళలు, సంస్కృతిని పాఠ్యాంశాల్లో చేర్చుకున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటామన్నారు. మన పండుగలను, కళలను కాపాడుకున్నామని కవిత అన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సీబీఐ, ఈడీ దాడులు చేస్తూ... తమ సమయాన్ని వృథా చేస్తుందన్నారు. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రెస్ట్ తీసుకోను..రిలాక్స్ కూడా తీసుకునేది లేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని..నిప్పులొస్తాయని అన్నారు. భారత్ జాగృతి నుంచి అన్ని రాష్ట్రాలకు వెళ్తామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై .. ఉద్యమ స్పూర్తితో దేశంలోని సమస్యలపై పోరాడతామన్నారు. ఫోర్ట్ ఎస్టేట్ అయిన మీడియా ప్రైవేట్ ఎస్టేట్ గా మారిందని కవిత అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కూల్చేస్తుందని ఆరోపించారు. కేంద్రం కుట్రలను మీడియా ఎత్తి చూపాలకానీ లీకులిచ్చి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. దళిత విద్యార్థులకు దేశంలో ఎక్కడా స్కాలర్ షిప్ ఇవ్వడం లేదన్నారు.