Telangana Congress :  బిఆర్‌ఎస్‌కు రంగారెడ్డి డిసిసిబి చైర్మన్ బి మనోహర్ రెడ్డి రాజీనామా చేశారు. బిఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మనోహర్ రెడ్డి రాజీనామా చేశారు. మనోహర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.  టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మనోహర్ రెడ్డి కలిశారు.  తాండూరు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది . కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6  గ్యారంటీ పథకాలకు ఆకర్షితుడినయ్యానని..  పార్టీపై అభిమానంతో వెళుతున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సన్నిహిత నేతగా మనోహర్ రెడ్డికి పేరుంది. పరిగి నియోజకవర్గం టికెట్ ను ఆశించాడు. కానీ, ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవటంతో మనోహర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.                                    


ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మనోహర్ రెడ్డిని సంప్రదించడంతో పాటు, తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలిసింది.   ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. తాండూరులో గత ఎన్నికల్లో  కాంగ్రె్స పార్టీ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి విజయం సాధించారు. కానీ ఆయన బీఆర్ఎస్‌లో చేరిపోయారు. బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లోచేరుతారని అనుకున్నారు. అయితే ఆయనకు ఇటీవల మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ నుంచే .. తాండూరు అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారు.                             


తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. టిక్కెట్ కోసం  టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ మహ రాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మరో ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి,  మాజీ సర్పంచ్ ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి,   ప్రముఖ వ్యాపారి శ్రీరాంరెడ్డి  సహా పది మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు.  కానీ గెలుపు గుర్రాలు ఏ పార్టీలో ఉన్నా చేర్చుకోవాలన్న ఉద్దేశంతో మనోహర్ రెడ్డిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.   నియోజకవర్గంలో ప్రజాకర్షణ, ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా ఏ నేత ఎవరు, ఆర్థిక, అంగబలం ఎవరికి ఉన్నాయి, సర్వేలు ఎవరికి అనుకూలంగా వచ్చాయో వాటి ఆధారంగా కాంగ్రెస్‌ అధిష్టానం వడపోత చేపడుతున్నది. గెలిచే అభ్యర్థికే టికెట్‌ ఇచ్చేం దుకు కాంగ్రెస్‌ పెద్దలు చర్యలు తీసుకుంటున్నారు.                           


కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సర్వే చేసి ఇస్తున్న నివేదికల మేరకు.. ఇతర పార్టీల్లో టిక్కెట్లు లభించని  బలమైన నేతలని ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు లేని ఇతర చోట్ల కూడా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.