ఆన్‌లైన్‌ న్యస్‌ పోర్టల్‌ న్యూస్‌ క్లిక్‌ కార్యాలయం, జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై దిల్లీ పోలీసులు దాడి చేసిన నేపథ్యంలో బుధవారం పలు సీనియర్‌ జర్నలిస్ట్‌ సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూద్‌కు లేఖ రాశారు. దాదాపు 18 జర్నలిస్ట్‌ సంస్థలు సీజేఐకి రాసిన లేఖపై సంతకం చేశాయి. తాము భయంతో పనిచేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భారతదేశంలో చాలా మంది జర్నలిస్టులు ప్రతీకార ముప్పు కింద పనిచేయాల్సి వస్తోందని తెలిపారు. న్యూస్‌క్లిక్‌పై UAPA కింద చర్యలు చేపట్టడాన్ని ప్రస్తావిస్తూ.. జర్నలిజాన్ని ఉగ్రవాదంగా ప్రాసిక్యూట్‌ చేయడం సాధ్యం కాదని తెలిపారు. చరిత్రలో అది చివరికి ఎక్కడికి వెళ్తుందో చెప్పడానికి తగిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులపై ప్రతీకార దాడులు జరగకుండా ఉండాలని, వారు నిజాలు మాట్లాడగలిగినంత కాలం దేశంలో స్వేచ్ఛ కాపాడొచ్చని పాత్రికేయ సంస్థలు తెలిపాయి. 


దేశంలోని దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తున్నారని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని, వారిని అడ్డుకునేందుకు సోదాలు చేస్తూ ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో జర్నలిస్టులు భయపడుతున్నారని, భయంతో పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నాయి. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోకూడదని, అది సమాజానికి మంచిది కాదని, జర్నలిస్టులుగా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని జర్నలిస్ట్‌ సంస్థలు సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నాయి. మీడియా సంస్థలపై అణిచివేతకు ముగింపు పలికేందుకు ఉన్నత న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.


చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్‌ క్లిక్‌ పోర్టల్‌ కార్యాలయంపై దిల్లీ  పోలీసులు దాడులు చేశారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థాను అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు కూడా అందుకుంటున్నారని ఆరోపణలు రావడంతో UAPA చట్టం కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశీ నిధులపై దర్యాప్తు నేపథ్యంలో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 30 చోట్ల జర్నలిస్టుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. డిజిటల్‌ పరికరాలు, పలు డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. ఇప్పటివరకు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. 


మరోవైపు న్యూస్ క్లిక్ తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై పోలీసులు దాడి చేయడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూస్ క్లిక్ పై దాడులు విపక్ష కూటమి ఇండియా నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడే వారి గళాన్ని అణచివేసేందుకు కేంద్రం సోదాలు చేసిందని విమర్శించారు.


న్యూస్ క్లిక్ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయి అంటూ ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ లో కథనం ప్రచూరితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నివిల్ రాయి సింగం నుంచి గ్లోబల్ నెట్వర్క్ లో భాగంగా ఉన్న న్యూస్ క్లిక్ నిధులు పొందినట్లు ఆ కథలలో పేర్కొంది. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.