Singareni Jobs Fraud :ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈ రోజుల్లో మాటలు కాదు. రేయింబవళ్లు కఠోర శ్రమ చేస్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి. ఒక్క పోస్టుకు వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎప్పుడూ హాట్ కేకులే. అందుకే నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. సింగరేణి ప్రాంతమైన రామగుండం గోదావరిఖని తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో మళ్లీ ఉద్యోగాల పేరిట ఆశవహులపై దళారులు వల విసరడం  ప్రారంభమైంది. ఈ మధ్య రచ్చకెక్కిన రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ విషయం పూర్తిగా మర్చిపోకముందే కొత్తగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రావడంతో దళారులు మళ్లీ వేట ప్రారంభించారు. అమాయకులకు ఆశలు కల్పిస్తూ లక్షల్లో వసూలుకు తెరలేపుతున్నారు. ముందుగా అడ్వాన్స్ చెల్లించాలని కనీసం 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇస్తే జాబ్ గ్యారెంటీ  అంటూ వారిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


సింగరేణిలో జాబ్స్ 


సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ప్రకటించడంతో సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో దళారులు పైరవీలు మొదలుపెట్టారు. ఒక్కొక్క ఉద్యోగం కోసం అడ్వాన్స్ గా 5 నుండి 10 లక్షల వరకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్నల్ గా 155, 117 మంది ఎక్స్టర్నల్  ద్వారా గ్రేడ్-2 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో దళారుల సిద్ధమయ్యారు. మే 19వ తేదీన ఇంటర్నల్ ఖాళీలను, జూన్ 16 వ తారీఖున ఎక్స్టర్నల్ ఖాళీలను భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటికి మే 25 నుంచి జూన్ 10 వరకూ ఇంటర్నల్ అభ్యర్థులకు, జూన్ 20 నుండి జులై 10 వరకు ఇతర అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో తర్వాత ప్రక్రియ కోసం తమకు హైలెవల్ లో పరిచయాలు ఉన్నాయని డబ్బులు దండుకుంటున్నారు దళారులు. ఉద్యోగం వచ్చాక అడ్వాన్స్ పోను మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మిస్తున్నారు. 


 సీన్ రిపీట్


అయితే గతంలోనూ ఇదే తరహా దందా వల్ల సింగరేణికి చెడ్డపేరు వచ్చిందన్న అపవాదు ఉంది. 2015లో 450 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 ఉద్యోగ నియామకాల సమయంలో ఎగ్జామ్స్ నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ఉద్యోగాలకు ఎంపిక దొడ్డిదారిన జరిగిందనే ప్రచారం ఉంది. ఆ సమయంలో దాదాపు ఒక్కొక్కరి నుంచి 10 లక్షల వరకూ వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒకే ఇంట్లో ఇద్దరూ, ఒకే ప్రాంతానికి చెందినవారికి ఉద్యోగాలు వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో ఉద్యోగం దొరకడం అనేది చాలా మందికి ఒక కల. ఎక్స్టర్నల్ 117 ఖాళీలకు ఒక లక్ష మూడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్నెట్ ఖాళీలకు 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 4న రాతపరీక్ష ఉండగా జె.ఎన్.టి.యు మరోసారి వీటిని నిర్వహించాలని అనుకున్నా సింగరేణి మాత్రం స్వయంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కనీసం ఈసారైనా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని కోరాతున్నారు. 


Also Read : SCCL Junior Assistant Recruitment 2022: డిగ్రీ అర్హతతో సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగాలు- జులై 10 ఆఖరు తేదీ


Also Read : Singareni Jobs: సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ట్రాన్స్‌ఫర్, మెడికల్‌ బోర్డులో అవినీతే కారణమా ?