kCR News :    ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను  అనుసరిస్తూ  మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు కేసీఆర్‌ అని ప్రశంసించారు.     

                     
  



సశాస్త్రీయంగా యాగాన్ని పూర్తి చేశామని  స్వరూపానంద స్వామి స్పష్టం చేసారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందని చెప్పారు. మహా పూర్ణాహుతి అనంతరం యాగంలో మంత్రించిన జలాలను కేసీఆర్‌ దంపతులపై చల్లారు. యాగ భస్మాన్ని కేసీఆర్‌ నుదుట దిద్దారు.                                    


 
యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకరణలో దర్శనమిచ్చింది. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. పూర్ణాహుతి ముహూర్త సమయానికి నిర్దిష్ట సంఖ్యలో హవనాలను పూర్తి చేసారు. మహా పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్‌ దంపతులు పూజలు చేసారు.               

                                                   


అష్టదిక్పాలకులకు ఆర్గ్యం సమర్పించారు. అనంతరం పూర్ణాహుతి జరిపారు. కేసీఆర్‌ దంపతులు ధరించిన కంకణాలను విసర్జించడం ద్వారా యాగం పూర్తయింది. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి పాదపూజ చేసి కేసీఆర్‌ పుష్పాభిషేకంతో గురు వందనం సమర్పించారు. ఈసందర్భంగా శూలినీ దుర్గ కవచంతో అభిమంత్రించిన రక్షను స్వరూపానందేంద్ర స్వామి కేసీఆర్‌కు కట్టారు. అలాగే విశాఖ శ్రీ శారదాపీఠం నుండి ప్రత్యేకంగా రప్పించిన రాజశ్యామల అమ్మవారి శేష వస్త్రాలను స్వరూపానందేంద్ర స్వామి కేసీఆర్‌ దంపతులకు అందించారు. శుభానికి సూచికగా పండితులంతా పసుపు వస్త్రాలను ధరించి యాగానికి హాజరయ్యారు                                            


ఈ యాగానికి సందర్శకులకు అనుమతి  లేదు. ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ యాగాలు నిర్వహించినప్పుడు ప్రజలనూ అనుమతించేవారు. ఈ సారి ఎన్నికల కారణంగా ఎవరినీ అనుమతించలేదని తెలుస్తోంది.