Minister KTR : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గుర్తుచేసుకుంటా మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన వజ్రోత్సవాల వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు పోరాటాలు కొత్త కాదని ఆయన తెలపారు. 1948లో నిజాంపై, 1956లో ఆంధ్రాలో కలిపినప్పుడు, 1960 దశకంలో తెలంగాణ కోసం, 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేశామని గుర్తుచేశారు. తెలంగాణ నూతన సచివాలయానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడం హర్షణీయమని మంత్రి వెల్లడించారు.
మతం పేరుతో విద్వేషాలు
అంబేడ్కర్ సిద్ధంతాలు, దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వాటి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమైక్యంగా ఉండాలని జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మతపిచ్చి, విద్వేషాలు మాయలో పడితే తెలంగాణ మళ్లీ దశాబ్దాల వెనుకబాటుకు వెళ్తుందన్నారు. చిల్లర పంచాయితీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 నుంచి 90 శాతం కుటుంబాలకు పింఛన్ అందుతుందన్నారు. జిల్లాలో కొత్తగా 17 వేల మందికి పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాల సహా అనేక కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు.
కేటీఆర్ సభలో యువకుడి హల్ చల్
తెలంగాణ మంత్రి కేటీఆర్ వేములవాడలో పర్యటిస్తున్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు భాగంగా భారీ బందోబస్తు నడుమ సభ జరుగుతుండగా ఓ యువకుడు ఒక్కసారిగా స్టేజి మీదకు వచ్చి కలకలం సృష్టించాడు. స్టేజిపై కేటీఆర్, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్, బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తోబాటు కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ యువకుడు స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. దీంతో నాయకులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలసులు అతన్ని పట్టుకొని వేదిక కిందికి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువకుడు ఇలా ఎందుకు చేశారో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన యువకుడిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read : Minister Puvvada Ajay : భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు, జాతీయ పార్టీలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్