MLC Kavitha :  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్ నుంచి నోటీసులు అందాయని జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు.  ఢిల్లీలో కూర్చొని ఉన్న కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తనకు ఎటువంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కవితకు నోటీసులు వచ్చాయని విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆమె సోషల్ మీడియాలో ఈ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా కారణంగా కవిత క్వారంటైన్‌లో ఉన్నారు. 



ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ, ఏపీల్లోనూ సోదాలు 


ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో  హైదరాబాద్‌లో పలువురు వ్యాపార వేత్తలు , ఓ చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.  25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్‌రెడ్డి, అభిషేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట, దోమలగూడలో తనిఖీలు నిర్వహించారు.  హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో  నివాసం ఉంటున్న ఆడిటర్ బుచ్చిబాబు  నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.  


గత నెలలోనూ పలు ప్రాంతాల్లో సోదాలు


మూడు నెలల క్రితం మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా ఆయన తెలిపిన సమాచారం మేరకు లిక్కర్‌ స్కామ్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇదే వ్యవహారంలో గత నెల కూడా వివిధ ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే.


పలు కంపెనీలు, వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం


ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తం 12 మంది వ్యక్తులకు, 18 కంపెనీలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. నోటీసులు జారీ అయిన వారిలో..  అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు గోరంట్ల, పెర్నాయి రిచర్డ్, విజయ్ నాయర్, సమీర్ మహీంద్ర, దినేష్ అరోరా, చందన్ రెడ్డి, వై. శశికళ, మాగుంట రాఘవలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 11 మందికి నోటీసులు జారీ అయినట్లు ఈడీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.