Munugode Manifesto :   మునుగోడులో తనను గెలిపిస్తే ఐదు వందల రోజుల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి హమీ ఇచ్చారు.  మునుగోడు  నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసం తీసుకునే చర్యలను వివరిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో రోడ్లు వేయిస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు నితిన్ గడ్కరీ అంగీకరించినట్లు చెప్పారు. చేనేత కార్మికులకు టెక్స్ టైల్ పార్కు, చౌటుప్పల్ లో రూ. 25 కోట్లతో ఐటీఐ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న మునుగోడులో సమస్య పరిష్కారానికి ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మర్రిగూడలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రూ.100 కోట్లతో మూసీ నీళ్లను చౌటుప్పల్ లోని గ్రామాలకు ఎత్తి పోసే పథకాన్ని తీసుకొస్తామని రాజగోపాల్  మేనిఫెస్టోలో ప్రకటించారు. 



నిరుద్యోగుల కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రకటించారు. నిరుద్యోగులకు జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు వీధి వ్యాపారులకు రూ.10 వేల సాయం అందిస్తామని చెప్పారు. చౌటుప్పల్లో ఈఎస్ఐ హాస్పిటల్ తో పాటు రూ. 100 కోట్లతో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమృత్ సరోవర్ పథకం కింద వాటర్ ట్యాంకులు నిర్మించి తాగు నీటి కష్టాలు దూరం చేస్తానని మాట ఇచ్చారు.  కేంద్రం పెద్దలతో మాట్లాడే ఈ హామీలు ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు బీజేపీయే శ్రీరామ రక్ష అన్న ఆయన.. రాష్ట్రం బాగుపడాలంటే తమ వల్లే సాధ్యమని చెప్పారు. కనీసం రోడ్లు వేయిద్దామన్నా.. కాంట్రాక్టర్లు టెండర్లు వేసే పరిస్థితి లేదని రాజగోపాల్ విమర్శించారు. 


నాలుగేళ్లుగా మునుగోడుకు రాజగోపాల్ రెడ్డినే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నాలుగేళ్లుగా ఆయన ఏమీ చేయలేదు. అయితే మరో ఏడాదిలోపే ఎన్నికలు జరగనున్నాయి. అంటే 350 రోజులు కూడా లేవు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచేవారి పదవీ కాలం ఏడాదిలోపే ఉంటుంది. కానీ ఐదు వందల రోజుల్లోగా అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే తర్వాత కూడా తానే పోటీ చేస్తానని ఉద్దశం కావొచ్చు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనూ ఈట రాజేందర్ ఇలాంటి మేనిఫెస్టో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో తమ మేనిఫెస్టోను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ప్రశ్నిస్తూ ఉంటారు. 


రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలుకూడా నేరుగా అందవు. రాష్ట్రం ద్వారా అందాల్సిందే. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎమ్మెల్యే  అయినప్పటికీ నేరుగా కేంద్రం నుండి నిధులు తెస్తామని..టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా పర్వాలేదని అంటున్నారు. అమలు చేస్తారో లేదో కానీ మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన  హామీలు మాత్రం ఆకర్షణీయంగా ఉన్నాయి.