Rajagopal Reddy :  తెలంగాణ బీజేపీలో చేసిన మార్పులు కూడా కొంత మంది నేతల్ని సంతృప్తి పరచడం లేదు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మంగళవారంనాడు భేటీ అయ్యారు. వారి మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అంశంపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.  అయితే ఇప్పుడే పార్టీ మార్పుపై ఇప్పటికిప్పుడు నిర్ణ‌యం తీసుకోలేన‌ని  రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా తెలు్సోతంది.  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చాలని కోరిన వారిలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.. తాజాగా బండి సంజ‌య్ ని అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి కిష‌న్ రెడ్డికి ఆ బాధ్య‌త‌ను క‌ట్ట‌బెట్టింది.


రాజగోపాల్ రెడ్డికి దక్కని పదవులు                                         


అలాగే ఈట‌ల కూడా తెలంగాణ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితుల‌య్యారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఎలాంటి పదవి లభించలేదు.  ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి, జూప‌ల్లిలో కాంగ్రెస్ ఘ‌ర్ వాప‌సీ పై విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు…దీనిలో భాగంగానే నేడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని క‌ల‌సి పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఆయన ఇటీవల బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో మళ్లీ తన స్థానం మునుగోడు నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 


బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ బీజేపీనేనని ఆ పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి             


రేవంత్ రెడ్డిని టీ పీసీసీ చీఫ్‌ను చేయడాన్ని  రాజగోపాల్  రెడ్డి వ్యతిరేకించారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ. ఆయన కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే మొదట ఉపఎన్నిక వ్యూహంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. తర్వాత వెంకటరెడ్డి కూడా చేరుతారని అనుకున్నారు. కానీ  కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. కేసీఆర్ ను ఓడించే పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రకటనలు చేస్తూ వచ్చిన  రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


ఎన్నికల  ముందైనా కాంగ్రెస్‌లో చేరడం ఖాయమేనా ?                              


కవితను అరెస్ట్ చేయకపోవడం ఢిల్లీ లిక్కర్ స్కాంలో తదుపరి చర్యలు తీసుకోకపోవడం.. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని రాజగోపాల్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారని చెబుతున్నారు. ఇవాళ కాకపోతే.. రేపైనా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.