పవన్ కల్యాణ్ ఇరిటేషన్ స్టార్ అని, చంద్రబాబు ఇమిటేషన్స్ స్టార్ అని ఏపీ పర్యాటక మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వారు ఇద్దరూ కలిసి ఇన్స్పిరేషన్ స్టార్ జగన్మోహన్ రెడ్డి కాలిపై వెంట్రుక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగిరి నియోజకవర్గంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. నగిరిలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
చిత్తూరు జిల్లా ప్రజలు కోరుకున్న విధంగా సీఎం జగన్ విజయా డైరీకి ప్రాణం పోశారని అన్నారు. అమూల్ సంస్ధతో ఆయూష్షు పోసి పాడి రైతుల జీవితాల్లో వెలుగును నింపారని కొనియాడారు. అల్లూరి సీతారామరాజుని ప్రజలు గుండెల్లో పెట్టుకున్న విధంగానే సీఎం జగన్‌ను కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు సిగ్గుపడాల్సిన రోజు ఇదని విమర్శించారు. చిత్తూరులో రాజకీయం చేసి చిత్తూరు ప్రజల ఆశీస్సులతో మూడు సార్లు సీఎంగా అయిన చంద్రబాబు ఏ రోజూ విజయా డైరీ గురించి ఆలోచించలేదని అన్నారు.
హెరిటేజ్ సంస్థ అభివృద్ధి కోసం విజయ డైరీని మూసేసిన దుర్మార్గుడు అంటూ సంచలన విమర్శలు చేశారు. 2014లో చంద్రబాబు సీఎం అయినా ఏమాత్రం విజయా డెయిరీని పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. 183 కోట్ల అప్పుల్లో ఉన్న విజయ డెయిరీ అప్పు తీర్చి అమూల్ సంస్థతో దాదాపు రూ.385 కోట్లు పెట్టుబడిగా పెట్టించారని గుర్తు చేశారు. జగనన్న పాల వెల్లువ వచ్చిన తర్వాత పాడి రైతులకు పాల ధర పెరిగిందని అన్నారు.
ఏపీ ప్రజలంతా హాయ్ హాయ్ ఏపీ, బాయ్ బాయ్ బీపీ, వన్స్ అగైన్ వైఎస్ఆర్ సీపీ అంటున్నారని అన్నారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, రికార్డులు సృష్టించాలన్నా.. ఆ రికార్డులను బ్రేక్ చేయాలన్నా కేవలం జగనన్నకే సాధ్యమని అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయినా కుప్పంను మున్సిపాలిటీ చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని మంత్రి రోజా అన్నారు.