Rajagopal Reddy : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చారు. సుశీ ఇన్ ఫ్రా కంపెనీతో తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు. ఆ సంస్థ ఎవరికి డబ్బులు పంపిందో తనకు తెలియదన్నారు. ఇవే వివరాలతో తాను ఎన్నికల సంఘానికి సమాధానం పంపానని... రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29న పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగిందని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ ఈసీఐకి ఫిర్యాదు చేశారు.
ఆన్ లైన్ నగదు బదిలీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని టీఆర్ఎస్ ఫిర్యాదు
దాదాపు రూ.5.24 కోట్లను మునుగోడు నియోజకవర్గంలోని 23 మందికి చెందిన బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ నగదుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.ఒకవేళ ఈ నగదు మీ ఆదేశాలతో కంపెనీ బదిలీ చేసి ఉన్నట్లయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆ ఖాతాల్లోకి నగదు జమ చేయలేదని భరోసా ఇవ్వాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. అయితే అసలు సుశీ ఇన్ ఫ్రా కంపెనీతో తనకు సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి ఆన్సర్ ఇచ్చారు. అది తన కుమారుడి కంపెనీ అని.. ఆ కంపెనీ చేసే లావాదేవీలపై తనకు ఏ మాత్రం సమాచారం ఉండదన్నారు.
రాజగోపాల్ రెడ్డి వివరణను చూసి చర్యలపై నిర్ణయం తీసుకోనున్న ఈసీ
సోమవారం సాయంత్రం నాలుగు గంటలలోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. అంత కంటే ముందే ఈసీ కి రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దీంతో నాలుగు గంటల తర్వాత ఈసీ రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సమాధానాన్ని సమీక్షించి సంతృప్తి చెందకపోతే ఏదో ఓ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ సంతృప్తి చెందితే మాత్రం ఎటువంటి చర్యలు ఉండవు. అయితే ఆ డబ్బులు ఓటర్లను పంచడానికేనని.. నిరూపించే ఆధారాలు టీఆర్ఎస్ సమర్పిస్తే.. ఈసీ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కానీ అసలు ఆ డబ్బు గురించే తనకు తెలియదని బీజేపీ అభ్యర్థి స్పష్టం చేస్తున్నారు.
అత్యంత ఖరీదుగా మారిన మునుగోడు ఉపఎన్నిక
మునుగోడు ఉపఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి మునుగోడుకు తరలిస్తున్నట్లుగా భావిస్తున్న రూ. కోట్లు పట్టుబడుతున్నాయి. హవాలా ఏజెంట్ల నుంచి ఈ నగదు తరలి పోతోంది. ఇలా పట్టుబడుతున్న సొమ్ము అంతా.. బీజేపీదేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీ నేతల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినట్లుగా టీఆర్ఎస్ గుర్తించి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.