Rains in Andhra Pradesh and Telangana | హైదరాబాద్: నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే సీజన్ ముగిసింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తేలికపాటి వర్షం పడుతుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అక్టోబర్ 4వ తేదీన మేఘాలయా, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. 


మరో నాలుగైదు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనతో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లోని గంగాతీర ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన చోట్ల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో వర్ష తీవ్రతను తట్టుకునేందుకు సిద్దంగా ఉండాలని దాని అర్థం.






ఏపీలో వర్షాలు..
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి జల్లులతో పలు జిల్లాల్లో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు.






తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్
తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవనుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. గురువారం రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నల్గొండ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలతో పాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.


శుక్రవారం నాడు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుంది. హైదరాబాద్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. ఆకాశం మేఘావృతమై ఉండి, కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురవనుంది.
Also Read: Pawan Kalyan: ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి, అల్లా పేరు అంటే ఆగిపోతారు- తిరుపతిలో పవన్ కళ్యాణ్