Rahul Gandhi Visit to Telangana: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మళ్లీ తెలంగాణ పర్యటన కోసం రానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత దూకుడుగా చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలోనే ఒకేరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) సమావేశాలు ఉండేలా కూడా ప్లాన్ చేస్తూ ఉంది.
ఈసారి రాహుల్ గాంధీ (Rahul Gandhi) వరుసగా 6 రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 17న రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణకు వచ్చి 23వ తేదీ వరకూ ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 17 నుంచి రాహుల్ గాంధీ.. అదే రోజు పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో ప్రచారం నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు వేరు వేరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలల్లో వరుసగా ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇంకా ప్రతి నియోజకవర్గంలో ముఖ్యనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటించేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపనున్నారు.
వారం రోజుల క్రితం రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. ఇటీవల హాట్ టాపిక్ అయిన మేడిగడ్డ బ్యారేజీని కూడా రాహుల్ గాంధీ (Rahul Gandhi) సందర్శించిన సంగతి తెలిసిందే.