Telangana News : దళిత బంధు పథకం లబ్దిదారుల నుంచి ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటున్నరని సీఎం కేసీఆరే చెప్పారని.. ఈ విషయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ మాట్లాడాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉందని సీఎం కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో చెప్పారన్నారు. దళిత బంధులో ప్రజాప్రతినిధులు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆరే చెప్పారని.. దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. హైకోర్టు సుమోటోగా తీసుకుని సీఎం కేసీఆర్ కు నోటీసులివ్వాలన్నారు .
దళితబంధులో అవినీతికి పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకోకుండా.. తప్పు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ వెనకేస్తున్నారని విమర్శించారు రఘునందన్ రావు. దళితబంధులో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ హైకోర్టుకు లేఖ రాయాలని లేకపోతే ఏసీబీ డీజీకి అవినీతి చిట్టా వివరాలివ్వాలన్నారు రఘునందన్ రావు. ఈ రెండు జరగకపోతే ఏసీబీ డీజీ సీఎం కేసీఆర్ కు నోటీసులివ్వాలన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోని కేసీఆర్ కు ముఖ్యమంత్రి సీటులో కూర్చునే అర్హత లేదని మండిపడ్డారు. తప్పు చేస్తే తనయుడైనా..తనయ అయినా శిక్షిస్తానన్న కేసీఆర్ ఇవాళ ఒక సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించరో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉపముఖ్యమంత్రి రాజయ్యపై ఎలాంటి ఆరోపణలు రుజువు చేయకుండానే క్యాబినెట్ నుంచి ఎలా తొలగించారో.. బీసీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎలా తొలగించారో... మంత్రి నిరంజన్ రెడ్డిపై అదే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక మంత్రిపై అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కేసీఆర్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు రఘునందన్ రావు. ధరణిలో లోపాలున్నాయని రైతులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తప్పుబట్టినా మార్పులు చేయడం లేదన్నారు. ప్రభుత్వం పేద రైతుల భూములను అప్పనంగా అమ్ముకుంటుందన్నారు . డబుల్ బెడ్రూంలో అవినీతి, ధరణిలో అవినీతి, మిషన్ కాకతీయలో అవినీతి, దళితబంధులోనూ.. ఇలా ప్రభుత్వ పథకాలన్నింటిలో దోపిడి జరుగుతోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరుగుతున్న జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరు గురించి కూడా మాట్లాడారు. ఈ సభలో సర్వేల విషయాన్ని ప్రస్తావించారు. కొంత మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని, సరిగ్గా పని చేసి మళ్లీ గెలవాలని సూచించారు. పని తీరు బాగా లేని వారి జాబితా తన వద్ద ఉందని, వారు ప్రవర్తన మార్చుకోవాలని చెప్పారు. లేదంటే వారి తోకలు కత్తిరిస్తానని తేల్చి చెప్పారు. అయితే, ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారని కేసీఆర్ ఈ సభలో స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. దీనపైనే వివాదం ఏర్పడింది.