Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని, అతడిపై విచారణ కమిటీ నివేదికను బట్టబయలు చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది. రెజ్లర్ల ధర్నా నేటికి ఆరో రోజుకు చేరుకుంది. 2021 టోక్యో ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా, 1983లో నిర్వహించిన వన్డే వరల్డ్ కప్ లో భారత్‌కు సారథిగా వ్యవహరించిన మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్, ఒలింపిక్ ఛాంపియన్ షూటర్ అభినవ్ బింద్రాలు రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. న్యాయం కోరుతూ క్రీడాకారులు రోడ్లమీదకు రావడం తనను ఎంతగానో బాధిస్తుందని చోప్రా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు.
నన్ను బాధిస్తోంది : నీరజ్
తమ పోరాటానికి మద్దతు తెలిపాలని వినేశ్ ఫోగట్ ట్విటర్ వేదికగా అభ్యర్థించిన నేపథ్యంలో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘న్యాయం కోరుతూ మన క్రీడాకారులు వీధుల్లోకి రావడం నాకు బాధ కలిగిస్తోంది. వాళ్లు మన దేశానికి ప్రాతినిథ్యం వహించడానికి, మనల్ని గర్వించేలా చేయడంలో చాలా కష్టపడ్డారు. ఒక దేశంగా ప్రతి వ్యక్తి సమగ్రత, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పుడు జరుగుతున్నది ఇంకెప్పుడూ జరుగకూడదు. ఇది చాలా సున్నితమైన సమస్య. దీనిలో విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించి న్యాయం జరిగేలా అధికారులు వెంటనే చర్య లు తీసుకోవాలి..’ అని ట్వీట్ చేశాడు.
చాలా బాధాకరం : అభినవ్ బింద్రా
ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన అభినవ్ బింద్రా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘అథ్లెట్లుగా అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు మేం ప్రతిరోజు కఠిన శిక్షణ పొందుతాం. డబ్ల్యూఎఫ్ఐలో వేధింపుల ఆరోపణలకు సంబంధించి మన అథ్లెట్లు వీధుల్లో నిరసన తెలపడం చాలా బాధాకరం. ఈ విషయంలో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఈ అంశం ఆటల్లో క్రీడాకారులకు సురక్షిత, సరైన రక్షణ యంత్రాంగాన్ని ఎత్తి చూపుతున్నది. ఆ దిశగా మనం పనిచేయాలి..’అని పేర్కొన్నాడు.
న్యాయం జరుగుతుందా..? : కపిల్ దేవ్
కపిల్‌దేవ్ తన ఇన్‌స్టా స్టోరీస్ లో రెజ్లర్లు మీడియాతో మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేస్తూ ‘వాళ్లక న్యాయం జరుగుతుందా..?’అని ప్రశ్నించాడు.
ఇదిలాఉండగా రెజ్లర్లు రోడ్డెక్కడాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి. ఉష తప్పుబట్టారు. ధర్నా చేసే ముందు రెజ్లర్లు తమ వద్దకు వస్తే బాగుండేదని, వాళ్లు ఇలా ధర్నా చేయడం దేశ ప్రతిష్టకు చేటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాకు రాజకీయ పార్టీల మద్దతు కోరడాన్ని ఆమె తప్పుబట్టారు.