Glenmark Life shares: ఇవాళ్టి (శుక్రవారం, 28 ఏప్రిల్‌ 2023) ట్రేడ్‌లో, గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌ షేర్లు 9% ర్యాలీ చేశాయి, రూ. 525 వద్ద 52 వారాల కొత్త రికార్డ్‌ స్థాయిని తాకాయి. Q4 ఫలితాలు ఇచ్చిన జోష్‌తో కంపెనీ షేర్లు బాగా లాభపడ్డాయి. 


సూపర్‌ రిజల్ట్స్‌తో షేర్ల దూకుడు
2023 మార్చి త్రైమాసికంలో, గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌ లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 48% పెరిగి రూ. 146 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం కూడా గత సంవత్సరం ఇదే కాలం కంటే 21% వృద్ధితో రూ. 621 కోట్లకు పెరిగింది.


మార్చి త్రైమాసికంలో కంపెనీ ఎబిటా (EBITDA) 45.2% YoY పెరిగి రూ. 206.4 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో, ఎబిటా మార్జిన్‌ కూడా గత ఏడాది ఇదే కాలంలోని 27.7% కంటే మెరుగుపడి ఇప్పుడు 33.2% వద్దకు చేరింది. CDMO నుంచి అధిక సహకారం, మెరుగైన ఉత్పత్తి మిశ్రమం, PLI పథకం ప్రయోజనం, తక్కువ పెట్టుబడి వ్యయాలు మార్జిన్‌ వృద్ధికి దోహదం చేశాయి.


నాలుగో త్రైమాసికంలో జనరిక్ API ఆదాయం 15% YoY పెరిగింది. GPL వ్యాపారం బలంగా పుంజుకోవడం, విదేశీ API వ్యాపారంలో స్థిరమైన వృద్ధితో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యాపార వృద్ధి స్థిరంగా పెరుగుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.


మధ్యాహ్నం 1.20 గంటల సమయానికి, NSEలో, గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌ షేర్లు 7.18 శాతం లాభంతో రూ. 514 వద్ద ట్రేడవుతున్నాయి. 


ప్రైస్‌ యాక్షన్‌
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD), ఈ కౌంటర్‌ 23% లాభపడింది. గత నెల రోజుల్లోనే ఇది ఏకంగా 37% పెరిగింది. అయితే, గత ఒక ఏడాది కాలంలో పెరుగుదల దాదాపు 7%గా ఉంది.


దీర్ఘకాలిక చికిత్సలకు సంబంధించి.. అధిక విలువ కలిగిన, నాన్ కమోడిటైజ్డ్, APIల అభివృద్ధి, ఉత్పత్తుల్లో ఇది ఒక ప్రముఖ కంపెనీ.


గ్లెన్‌మార్క్ లైఫ్ అంక్లేశ్వర్ సైట్‌లో, 400KL తయారీ సామర్థ్యం ఉన్న ఇంటర్మీడియట్ మాన్యుఫ్యాక్చరింగ్ బ్లాక్‌లో 192KL ప్రారంభమైంది. మిగిలిన 208KL FY24 రెండో భాగంలో ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. షోలాపూర్‌లోని చించోలి ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాన్ చేసిన గ్రీన్‌ఫీల్డ్ సైట్ కోసం CTEతో (కాన్సెంట్ టు ఎస్టాబ్లిష్) పాటు 1000 KL కెపాసిటీని ఇన్‌స్టాల్‌ చేయడానికి పర్యావరణ అనుమతి పొందినట్లు వెల్లడించింది. ఈ ఫ్లాంట్‌ నిర్మాణ పనులు FY24లో ప్రారంభం అమవుతాయి.


ఐదుకు ఐదు "బయ్‌" రేటింగ్స్‌
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం... ఈ స్టాక్ సగటు టార్గెట్ ధర రూ. 536. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 4% పెరుగుదలను ఈ టార్గెట్‌ ప్రైస్‌ చూపుతోంది. ఈ స్టాక్‌ను ట్రాక్‌ చేస్తున్న ఐదుగురు ఎనలిస్ట్‌ల ఏకాభిప్రాయ సిఫార్సు "బయ్‌". వీరిలో నలుగురు "స్ట్రాంగ్‌ బయ్‌" రేటింగ్‌ ఇవ్వగా, మిగిలిన ఒకరు "బయ్‌" సిఫార్సు చేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.