Punjab CM Meet KCr : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశ వ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రితో ఈ అంశంపైనే చర్చించినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఎంపీలు, జాతీయ స్థాయిలో సంబంధాలున్న వారి సూచనల మేరకు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సన్నాహాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్‌సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, రైతు సంఘాల నేతలు కేసీఆర్‌తో సమావేశమవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. బీజేపీపై పోరాటం విషయంలో కేసీఆర్‌కు పలువురు నేతలు మద్దతు తెలుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి
బీఆర్ఎస్ పార్టీని ప్రకటించకముందే కేసీఆర్ పంజాబ్ లో పర్యటించారు. రైతు ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు సాయం చేశారు. చెక్కులు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. పంజాబ్‌లో అక్కడి ప్రభుత్వం చేపట్టిన కొన్ని కీలక ప్రాజెక్టుల గురించి కూడా తెలుసుకున్నారు. అప్పట్నుంచి ఇద్దరు సీఎంల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా సీఎం కేసీఆర్ పార్టీపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.
భారత్ రాష్ట్ర సమితిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలెవరూ రాలేదు. వచ్చి కనీసం పలకరించలేదు. దీంతో జాతీయ స్థాయిలో కేసీఆర్ తో .. ఆమ్ ఆద్మీ పార్టీ కలసి నడుస్తుందా లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది.. ఇప్పుడు కూడా భగవంత్ మాన్ హైదరాబాద్‌లో ఇతర కతార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు కానీ.. ప్రత్యేకంగా భేటీ కావడానికి రాలేదని..ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం లేదని ఆమ్ ఆద్మీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.