Professor Kodandaram Latest News: ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ల తరబడి నిర్మాణ దశలో ఉన్న పోలవరం ప్రాజెక్టు గురించి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం కనుక పూర్తి అయితే తెలంగాణలో ఉన్న భద్రాద్రి పవర్ ప్లాంట్ ముంపునకు గురవుతుందని ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్.. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్‌లకు రూపకల్పన చేశారని విమర్శించారు. 


తెలంగాణ చీకట్లలో ఉందని అంటూ కేసీఆర్ రూ.వందల కోట్లను ఆయా ప్రాజెక్టుల కోసం వెచ్చించారని గుర్తు చేశారు. తద్వారా రూ.వందల కోట్లు నష్టం జరుగుతోందని చెప్పారు. విద్యుత్ రంగం అభివృద్ధి పేరుతో కేసీఆర్ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించారు. ఆ సమయంలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్ గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ కేంద్రాలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆయా థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిబంధనల ప్రకారం డిజైన్ చేయకపోవడం వల్ల.. ప్రాజెక్టు పూర్తి కాగానే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని ప్రొఫెసర్ కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనుసరించిన పద్ధతి ఏ మాత్రం కరెక్టు కాదని.. ఆయన ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక పరమైన అంశాల్లో కూడా కేసీఆర్.. తన అనునాయులు సహా, మిత్రులైన వ్యాపారవేత్తలకే లాభం చేకూరేలా కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. 


టెక్నాలజీ అంశాల్లో ప్రభుత్వానికి నష్టం అని తెలిసి కూడా దాన్నే ఉపయోగించారని తెలిపారు. చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కారని.. నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తాము కమిషన్ ను కోరినట్లుగా కోదండరామ్ తెలిపారు. విచారణ కమిషన్ వేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని అన్నారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ పరిధిలో లేవు కాబట్టి కమిషన్ వేయడానికి ఎలాంటి ఆటంకాలు రాలేదని తెలిపారు.