Kolkata: పశ్చిమ బెంగాల్‌లో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్‌ రైలు ఢీ కొన్న దుర్ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. అగర్తలా నుంచి కోల్‌కతాలోని సీల్ధాకు వెళ్తున్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. రంగపాణి స్టేషన్‌ వద్ద నిలిచి ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నలభైమందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ఓవైపు సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలతోపాటు మానవతప్పిదం కూడా కారణమని రైల్వే బోర్డు అధికారులు గుర్తించారు. 


లోపభూయిష్టమైన ఆటోమేటిక్‌ సిగ్నలింగ్ వ్యవస్థతో ఆ ప్రాంతంలో ట్రైన్స్ నడిచాయని గుర్తించారు. దీనికి తోడు ప్రమాద జరిగే సమయానికి గూడ్స్ ట్రైన్ పరిమితికి మించి స్పీడ్‌తో వెళ్తోందని తేల్చారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు రాతపూర్వకంగా TA 912ని జారీ చేస్తారు. ఈ ఆదేశాలు ఉన్న ట్రైన్ సిగ్నల్‌తో సంబంధం లేకుండా వెళ్లిపోతుంది. తగిన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత ఈ ఆదేశాలు ఇస్తారు. నిన్నటి ప్రమాదం బారిన పడ్డ రెండు ట్రైన్స్‌కు ఈ ఆదేశాలు ఉన్నాయి. 



TA 912 ఆదేశాలతో వెళ్లే ట్రైన్స్ కొన్ని రూల్స్ పాటించాలి. ఎక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా ఉండదో అక్కడ ఒక నిమిషం ఆగిన తర్వాత 10 కిలోమీటర్ల వేగంతా వెళ్లాల్సి ఉంటుంది. ముందు వెళ్లే ట్రైన్స్‌కు 150 మీటర్ల గ్యాప్‌తో ట్రావెల్ చేయాలి. ఈ విషయాలను గూడ్స్ ట్రైన్ డ్రైవర్ పూర్తిగా విస్మరించినట్టు నిర్దారనైంది. 


ఈ ప్రమాదంలో TA 912 అనుమతితో ప్రయాణిస్తున్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌కు అప్పటికే 8 ఆటోమేటిక్ సిగ్నల్స్‌ను దాటింది. ప్రమాద సమయంలో 9వ సిగ్నల్ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. గూడ్స్ ట్రైన్ డ్రైవర్‌కి కూడా రంగపాణి చత్తర్‌హాట్ మధ్య సిగ్నల్స్ క్రాస్ చేసే అధికారం ఇచ్చారు. TA 912 ఆదేశాలను ట్రైన్ డ్రైవర్‌కు ఉదయం 5.50కి ఇచ్చారు. అయితే స్పీడ్ విషయంలో మాత్రం ఆ డ్రైవర్ రూల్స్ పాటించలేదు. 


గూడ్స్ రైలు రంగపాణి నుంచి ఉదయం 8:42 గంటలకు బయలుదేరింది. 8:55 గంటలకు ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొంది. దీంతో ప్యాసింజర్ రైలులోని గార్డు కోచ్, 2 పార్శిల్ కోచ్‌లు, జనరల్ సీటింగ్ కోచ్ పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలు డ్రైవర్ స్పీడ్ కంట్రోల్‌ చేయకపోవడంతోనే ప్రమాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. 


సిగ్నలింగ్ లోపం గురించిన తెలిసిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ అప్రమత్తంగానే ఉన్నాడు. ఆ సిగ్నల్ దాటేందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. రెడ్ సిగ్నల్స్ వద్ద ఒక నిమిషం ఆగి 10 కి.మీ వేగంతో ముందుకు వెళ్లాడు. గూడ్స్ రైలు డ్రైవర్ మాత్రం ఆ రూల్‌ను పాటించలేదు. పరిమితికి మించిన వేగంతో వెళ్లి ప్యాసింజర్ రైలును ఢీ కొట్టాడు.


TA 912 అధికార లేఖలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు రంగపాణి చత్తర్‌హాట్ స్టేషన్‌ల మధ్య రెడ్‌ సిగ్నల్స్ వద్ద ఎక్కువ సమయం వెయిట్ చేసే సమస్య లేకుండా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. రెడ్ సిగ్నల్ ఉన్నచోట డే టైంలో నిమిషం , రాత్రి వేళల్లో 2 నిమిషాలు ఆగాలి. రోడ్డు విజిబిలిటీ బాగుంటే గంటకు 15 కిలోమీటర్ల వేగంతో రోడ్డు విజిబిలిటీ బాగోలేకుంటే గంటకు 10 కిలోమీటల్ వేగంతో వెళ్లాలని అందులో స్పష్టంగా ఉంది. 



రూల్స్ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ గూడ్స్ ట్రైన్ డ్రైవర్‌ మితిమీరిన వేగంతో వెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడు. ఇదే విషయం రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. పట్టాలు తప్పిన కోచ్‌లను ట్రాక్‌ నుంచి పక్కకు తప్పించి ఆ దారిలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదంలో గాయపడిన వారంతా నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న 41 మందిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. 


ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్‌ఎస్) విచారణ ప్రారంభించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు పర్యవేక్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులకు సూచించారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి యాభై వేలు ఇస్తామని ప్రకటించారు.