ఇస్లామాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై పాకిస్తా్న్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాంతో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) చేసిన టెర్రరిస్టులను స్వాతంత్ర్య సమరయోధులుగా ఇషాక్ దార్ అభివర్ణించారు. అసలే ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్ పై భారత్ మండిపడుతోంది. పాక్ ను ఏకాకి చేయాలని, తద్వారా బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం భావిస్తుంటే మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత హేయమైన కామెంట్లు చేస్తోంది.

పాక్ మీద భారత్ ఉక్కుపాదం..

ఇదివరకే పాకిస్తాన్ మంత్రి ఆ దాడితో మాకు సంబంధం లేదు. మోదీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో దేశంలోని శక్తులే జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం పాక్ పై ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీసాలు రద్దు చేయడంతో పాటు పాక్ పౌరులు ఆ దేశానికి వెళ్లిపోవాలని సూచించింది. అటారీ, వాఘా సరిహద్దు మూసివేయడంతో పాటు పాక్ జీవనాడి అయిన సింధు జలాల ఒప్పందంపై నిషేధం విధించి దాయాది నడ్డి విరిచింది..

పాక్ ఉప ప్రధాన మంత్రి అయిన ఇషాక్ దార్ గురువారం మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న పహల్గామ్ లో దాడులు చేసిన వారు స్వాతంత్ర్య సమరయోధులు అని వ్యాఖ్యానించారు. 1960 సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తరువాత పాక్ మంత్రులు, ప్రతినిధులు భారత్ పై మరింత విషం చిమ్ముతున్నారు. ఇందులో భాగంగా కాశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడి 26 మంది పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా పేర్కొనడంపై దుమారం రేగుతోంది.

బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ కేబినెట్ కమిటీ సమావేశంలో సింధు జలాల ఒప్పందంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్య  కోసం దేశానికి వచ్చి ఉన్న పాకిస్తానీయులకు జారీ చేసిన అన్ని వీసాలను కేంద్రం రద్దు చేసింది. భారత్ తీసుకుంటున్న చర్యలపై ఇషాక్ దార్ మాట్లాడుతూ, ఇది యుద్ధ చర్య లాంటిదన్నారు. 

సింధు జలాలను ఆపాలనుకోవడం యుద్ద చర్యే

పాకిస్తాన్‌లోని 240 మిలియన్ల మందికి నీళ్లు అవసరం. భారత్ సింధు జలాలను ఆపలేదు. కనుక భారత్ నిర్ణయం యుద్ధ చర్యతో సమానం. ఏదైనా సస్పెన్షన్ లేదా ఆక్రమణ లాంటివి అంగీకరించేది లేదు. పాకిస్తాన్‌పై భారతదేశం చేసిన దాడికి మరింత తిరిగిచ్చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు రావాల్సిన వాటా ఇవ్వాలి. అలా కాదని చర్యలు తీసుకుంటే దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశం తరువాత ఆ ప్రకటన విడుదల చేశారు.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ.. మా దేశ ప్రజలకు ఎవరైనా హాని కలిగిస్తే, దానికి ప్రతిగా భారత ప్రజలకు హాని చేస్తామని హెచ్చరించారు. మేం ప్రతీకారం తీర్చుకుంటే భారత్‌కు నష్టం వాటిల్లుతుంది. ఏప్రిల్ 22 పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసారన్ మెడోస్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ ఉగ్రదాడి చేసింది తామేనని ప్రకటించుకుంది