Priyanka Gandhi Telangana Tour Cancelled: ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణ పర్యటన రద్దైంది. మంగళవారం ఆమె చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభా వేదికగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. దీని కోసం తగిన ఏర్పాట్లు సైతం చేసింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దైందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ 2 పథకాలను ఆమె వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. 


కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. ఇక, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని చేవెళ్ల బహిరంగ సభలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేసింది. అయితే, అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడం వల్ల ఆమె ఈ పథకాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 


పథకం అమలు ఇలా


రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే, పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500 అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ (DBT - Direct Benefit Transfer) ద్వారా రీయింబర్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తోన్న రూ.40 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.955 ఉంటే.. వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోనూ మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని తెలుస్తోంది.


హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.955. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో రూ.974, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రూ.958.50, నారాయణపేట జిల్లా ధన్వాడలో రూ.973.50గా ఉంది. రవాణా ఛార్జీల వ్యత్యాసం వల్లే ఇలా పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో ఒక్కో చోట ఒకలా సిలిండర్ ధర ఉంది. అయితే, రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 11.58 లక్షలు ఉండగా.. వీరికి కేంద్రం నుంచి సిలిండర్ రాయితీ రూ.340 వస్తోంది. మహాలక్ష్మిలో ఎంపికైన గ్యాస్ వినియోగదారులు సిలిండర్ పై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోనూ.. మిగతా మొత్తం రూ.500 కంటే ఎంత అధికంగా ఉంటే అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ ధర రూ.970 ఉంటే.. వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోనూ రూ.130ను రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా జమ చేస్తుంది. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలతో సిలిండర్ ధర అదనంగా ఉన్నా ఆ భారం ప్రజలపై పడొద్దనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


Also Read: Telangana LRS Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్, క్రమబద్ధీకరణకు ఛాన్స్