Railway Infra Projects: రూ.41 వేల కోట్ల విలువైన 2 వేల రైల్వే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రైల్వేలో కొన్నేళ్లుగా వచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించారు. ఇది నవభారతం అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రాజెక్ట్‌లు నవ భారతానికి నిదర్శనమని వెల్లడించారు. సంస్కరణల పట్ల తమ ప్రభుత్వానికి ఎంతో నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. ఎవరూ ఊహించని వేగంలో మౌలిస వసతులు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఒకప్పుడు చిన్న చిన్న కలలు కన్న భారత్ ఇప్పుడు భారీ కలల్ని నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.
"ఇవాళ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి ప్రాజెక్ట్ నవ భారతానికి నిదర్శనం. ఎవరూ ఊహించని వేగంతో భారత్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. చిన్న చిన్న కలలు కనడం నుంచి భారత్ పెద్ద కలల్ని నిజం చేసుకునే స్థాయికి ఎదిగింది. ఇవాళ రెండు వేల రైల్వే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన జరిగింది. జూన్‌లో మూడోసారి మేం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. పనులు జరుగుతున్న వేగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా యువతకు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతారని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ నినాదం యువత కోసమే అని తెలిపారు. యువతీ యువకుల కలలే కొత్త భారత్‌కి నాంది పలుకుతాయని అన్నారు.
"రాజ్‌కోట్ నుంచి 5 AIIMS లను వర్చువల్‌గా ప్రారంభించాను. 27 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో ఇవాళ 554 రైల్వే స్టేషన్‌ల నవీకరణకు శంకుస్థాపన జరిగింది. యూపీలో గోమతీ నగర్ రైల్వే స్టేషన్‌నీ ప్రారంభించాను. 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు, రోడ్ అండర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం మొదలు కానుంది"
- ప్రధాని నరేంద్ర మోదీ