Priyanka Gandhi Telangana Tour: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం (నవంబరు 19) ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీ స్కీంలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ముందుగా ఖానాపూర్ నియోజకవర్గంలో (Khanapur News) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు మద్దతుగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ఆమె మాట్లాడనున్నారు. అనంతరం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి అజ్మీర శ్యామ్ నాయక్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రసంగించనున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) శ్రేణులు సభ ఏర్పాట్లను ముమ్మరం చేశారు.


సభా స్థలాన్ని పరిశీలించిన సేక్యూరిటి లైజనింగ్ ఢిల్లీ అధికారి వివేక్


ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం రానున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేసారు సెక్యూరిటి లైజనింగ్ ఢిల్లీ అధికారి వివేక్. సభ ప్రాంగణంలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత సిబ్బందితో పరిశీలించారు.


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి అన్నారు. బిజెపి పార్టీకి విజయశాంతి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి పార్టీ మనుగడ కోల్పోయిందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్య పోటీ ఉంటుందని తెలిపారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం 2 సభలలో పాల్గొననున్నారని, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ బహిరంగ సభలు తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు మండల నాయకులకు ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులని ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తుందని తెలిపారు.