Modi in Hyderabad : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో   రోడ్‌ షోలో పాల్గొంటున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి చౌరస్తా వరకు 1.3 కి.మీ మేర ఈ రోడ్‌ షోను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. మల్కాజిగిరిలో రోడ్ షో ముగిసిన అనంతరం ప్రధాని మోదీ రాజ్‌భవన్‌కు వెళ్లి బస చేస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయలుదేరి నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈ సభను ఏర్పాటుచేస్తున్నారు.                





 


నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ గుల్బర్గా బయలుదేరి వెళతారు. తిరిగి 18న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ సెగ్మెంట్లకు సంబంధించి ఈ సభను ఏర్పాటు చేసినట్లు బీజేపీ వర్గాలు వివరించాయి.  పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారం లో వెలువడనున్న తరుణంలో ప్రధానమంత్రి రోడ్‌ షో బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది.   మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు మల్కాజిగిరిలో  మోదీతో ప్రచారాన్ని ఏర్పాటు చేశారు.  పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు ఇ ప్పటికే ఏర్పాటు చేశారు.                           


తెలంగాణలో  అత్యధిక సీట్లు గెల్చుకోవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా అగ్రనేతలు  పర్యటనలకు వస్తున్నారు. మూడు రోజుల కిందట అమిత్ షా పర్యటించారు. పార్టీ నేతలకు  దిశానిర్దేశం చేశారు. ఇప్పుడుప్రధాని మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మధ్యలో పదిహేడో తేదీన ఏపీలోనూ పర్యటించనున్నారు. అక్కడ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగసభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు.          


 
ప్రధాని మోదీ రెండు రోజుల నగర పర్యటన కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు బేగంపేట, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి–జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, ఎంఎంటీఎస్‌ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.  ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని  ట్రాఫిక్ పోలీసులు సూచించారు.                             


ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశా రు ఎయిర్‌పోర్ట్‌ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. ప్రధాని పయనించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.