President Draupadi Murmu Tour In Hyderabad: హైదరాబాద్ నగరానికి ఈ నెల 28న (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) రానున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన స్టాళ్లను, నాలుగు ఫుడ్ కోర్టులు, మీడియా సెంటర్, ఇతర స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రాలకు సంబంధించిన స్టాళ్లను, 4 ఫుడ్ కోర్టులు, మీడియా సెంటర్, ఇతర స్టాళ్లను పరిశీలించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును కూడా పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి పర్యటన క్రమంలో శనివారం సికింద్రాబాద్‌లోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి బేగంపేట(Begumpet), హెచ్‌పీఎస్, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, తివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
నల్సార్ 21వ స్నాతకోత్సవం..
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం శనివారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హాజరు అవుతున్నారు. విశిష్ట గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, నల్సార్ ఛాన్స్‌లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు విచ్చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ క్రిష్ణదేవరావ్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. స్నాతకోత్సవ ఏర్పాట్లను గురువారం సంబంధిత ప్రభుత్వ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు.
షెడ్యూల్ ఇదే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం 11:50 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 12:20కి నల్సర్ యూనివర్సిటీలో జరిగే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3:30కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం 2024ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45కు హకీంపేట్ ఎయిర్‌ఫోర్టుకు చేరుకుని తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సెక్రటేరియట్‌లో సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లు చేయనుండగా, రాష్ట్ర, కేంద్ర బలగాలు పర్యవేక్షణ, భద్రత చర్యల్లో పాల్గొంటాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్రపతి పర్యటన వేళ అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని అధికారులను ఆదేశించారు.