Praja Sangrama Yatra: ఆరునెలల్లో తెలంగాణలో ప్రభుత్వం మారిపోతుందని... బీజేపీ ప్రభుత్వం రాబోతోందని అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రం నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని గుండెగాం గ్రామానికి చేరుకుంది. వెల్కమ్ టు గుండెగాం అంటూ పూలతో నేలపై రాసి, బండి సంజయ్ పై పూలవర్షం కురిపిస్తూ గ్రామస్థులు ఆహ్వానం పలికారు. బాణసంచా కాలుస్తూ జై బీజేపీ అంటూ నినాదాలతో హోరెత్తించారు.


‘‘గుండెగాం ప్రజల బాధలు వింటే గుండె తరక్కుపోతోంది. వానొస్తే ఊరంతా మునిగిపోతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి లేదు. కమీషన్ల కోసం ప్రగతి భవన్, సచివాలయం కట్టుకుంటడు. కాళేశ్వరం కడతడు... కమీషన్లు రావని గుండెగాం ప్రజలను గాలికొదిలేసిండు. అయినా 250 కుటుంబాలను ఆదుకోలేనోడు... తెలంగాణను ఏం కాపాడతాడు?’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ కు పేదలంటే అలుసని.. కేసులు పెట్టి బెదిరిస్తూ, వేధిస్తూనే ఉంటారని అన్నారు. గుండెగాం ప్రజలు బాధపడొద్దని, బీజేపీ పూర్తి అండగా ఉంటూ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. వెంటనే గుండెగాం బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని, లేనిపక్షంలో కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు.


గుండెగాంలో రచ్చబండ నిర్వహించిన బండి సంజయ్..


గుండెగాం గ్రామస్థులతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి, సీనియర్ నేతలు రామారావు పటేల్, మోహన్ రావు పటేల్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు గుండెగాం గ్రామస్థులు బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ ఊరిలోకి స్వాగతం పలికారు. అడుగడుగునా బండి సంజయ్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం రచ్చబండలో గ్రామస్థులతో ముచ్చటిస్తూ వారి బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా తమ బాధను బండి సంజయ్ తో పంచుకున్నారు.


‘‘వర్షం వస్తే మా పరిస్థితిని మాటల్లో కూడా చెప్పలేం. గత ఏడేళ్లుగా పునరావాసం కోసం తిప్పలు పడుతున్నాం. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే మమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు. ప్రశ్నిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. గుండెగాం గ్రామం తెలంగాణలో లేదా? ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. వర్షా కాలంలో మమ్మల్ని చూడడానికి కూడా ఎవరూ రారు. నన్ను రెండుసార్లు పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేవలం మమ్మల్ని ఆదుకున్నది, మమ్మల్ని చూస్తున్నది బిజెపినే. ఆర్టికల్ 19 రాసింది మా పేదల కోసమే కాదా? బండి సంజయ్ వస్తున్నాడు అంటే... టిఆర్ఎస్ నేతలు వణికి, రెండుసార్లు సర్వే చేశారు’’అంటూ గుండాగాం బాధితులు వాపోయారు.


డబుల్ బెడ్రూం ఇళ్లు ముట్టుకుంటేనే పడిపోయేలా ఉన్నయ్..


కాలాలకు అతీతంగా సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ తెలిపారు. పేదోళ్ల కష్ట, సుఖాలను తెలుసుకోమని మోదీ ఆదేశిస్తేనే ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నాని వివరించారు. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం రావాలని, పేదోళ్ల రాజ్యం వస్తేనే... మీ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. గుండెగాంలో వర్షాలు వస్తే పడవలు వేస్కొని తరిగాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు ముట్టుకుంటేనే పడిపోయేంత నాణ్యతతో ఉన్నాయని ఎద్దేవా చేశారు. పంజాబ్ వెళ్లి రైతులకు సాయం చేసిన సీఎం కేసీఆర్ ఇక్కడ రైతులను మాత్రం పట్టించుకోడాని చెప్పారు. ఇక్కడ 250 కుటుంబాలనే కాపాడలేనోడు... తెలంగాణని ఏం కాపాడుతాడు అంటూ తీవ్ర విమర్శల చేశారు.  గుండెగాం ప్రజలను ఆదుకుంటావా, ఆదుకోవా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. గుండెగాం ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఇంకో 6 నెలల తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని.. తమ పార్టీ అధికారంలోకి రాగానే గుండెగాంను అద్దంలా మెరిపిస్తామని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.