Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో బిగ్ బ్రేక్ త్రూ లభించింది. శ్రద్ధాను తానే హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలో అంగీకరించాడు. హత్యానంతరం ఆమె శరీర భాగాలను అడవిలో పడేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడని సమాచారం.


ప్లాన్ ప్రకారం


ఆమెను హత్య చేయాలని చాలా కాలం క్రితమే అఫ్తాబ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది అమ్మాయిలతో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. మే 18న శ్రద్ధాను హత్య చేసినట్లు అఫ్తాబ్ అంగీకరించాడని, ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే ముంబయి నుంచి దిల్లీకి తీసుకొచ్చాడని విశ్వసీయ వర్గాలు తెలిపాయి.


శ్రద్ధాను చంపినందుకు చింతిస్తున్నావా అని అడిగినప్పుడు, అఫ్తాబ్ 'లేదు' అన్నాడు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అఫ్తాబ్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒప్పుకున్నాడు. 


అంతకుముందు నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్ష అఫ్తాబ్ అనారోగ్య కారణాలతో పూర్తి కాలేదు. ఈ విచారణలో శ్రద్ధాతో ఉన్న సంబంధాలపై నిందితుడిని 50కి పైగా ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం అఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్నాడు. అన్ని పరీక్షలను నిర్వహించడానికి పోలీసులకు మూడు రోజుల సమయం ఉంది. 


నార్కో టెస్ట్


పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో టెస్టు కూడా ఈ వారంలోనే నిర్వహించవచ్చు. అఫ్తాబ్ చెప్పిన సమాధానాలు, దొరికిన ఆధారాలతో దిల్లీ పోలీసులు నార్కో పరీక్ష కోసం 70 ప్రశ్నల జాబితాను సిద్ధం చేశారు. అయితే పాలిగ్రాఫ్ పరీక్ష పూర్తి నివేదిక రావాల్సి ఉంది. దీంతో నార్కో పరీక్షకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


ఇదీ కేసు


అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.


కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అఫ్తాబ్‌పై అనుమానం


తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.


అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.


దర్యాప్తులో


అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది. 


Also Read: Viral News: పిల్లాడ్ని చంపేస్తారా? పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వరా!