Prajapalana Application Process Completed: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక హామీల అమలు కోసం చేపట్టిన 'ప్రజాపాలన - అభయహస్తం' (Prajapalana) దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ 8 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తం 1,24,85,383 అర్జీలు వచ్చాయి. అయితే, ఓ కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని ప్రభుత్వం చెబుతున్నా.. అవగాహన లోపం, నిబంధనల్లో స్పష్టత లేక కొన్ని కుటుంబాల నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అన్ని దరఖాస్తుల ఎంట్రీని ఈ నెల 17 నాటికి పూర్తి చేసి.. అనంతరం అర్హతను బట్టి ఆయా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


దరఖాస్తుల వెల్లువ


6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు గ్రామ, వార్డు డివిజన్ సభల్లో దరఖాస్తులు స్వీకరించారు. 5 గ్యారెంటీల పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, మిగిలిన అవసరాల కోసం 19,92,747 అప్లికేషన్స్ వచ్చాయి. శనివారం ఒక్క రోజే 16,90,000 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలు, 3,624 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా, ఆరోగ్య శ్రీ పథకం బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచింది. మిగిలిన వాటి అమలు కోసం డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా అర్జీలు వచ్చాయి. 15 శాతం అభయహస్తం గ్యారెంటీలకు సంబంధం లేని.. రేషన్ కార్డులు, భూ సమస్యలు ఉన్నాయి. తెల్ల కాగితాలపైనా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 


వీటి కోసమే


'ప్రజాపాలన' దరఖాస్తుల ప్రక్రియలో ఎక్కువగా 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్లుపైనే దరఖాస్తుదారులు ఎక్కువ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. చాలా మంది తమ రేషన్ కార్డులు సొంతూరిలో ఉండడంతో అక్కడికి వెళ్లి అప్లికేషన్స్ సమర్పించారు. జిరాక్స్ అప్లికేషన్స్ సమర్పించిన వారికి అధికారులు ఫోన్లు చేసి రప్పించి మరీ కొత్త దరఖాస్తులు నింపించారు.


4 నెలలకోసారి


'ప్రజాపాలన'లో దరఖాస్తు చేయలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన పని లేదని ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ 4 నెలలకోసారి ఈ కార్యక్రమం చేపడతామని.. తొలి విడతలో అప్లై చేసుకోని వారు రెండో విడతలో అర్జీలు సమర్పించవచ్చని తెలిపింది. గ్రామసభల్లో దరఖాస్తు ఇచ్చేందుకు వీలు పడని వాళ్లు స్థానిక తహసీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీస్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అందుకున్న దరఖాస్తులను స్క్రూట్నీ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. వీటిని ఆన్ లైన్ చేసే ప్రక్రియను ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెటుకున్నారు. 


డీటీపీ ఆపరేటర్లకు శిక్షణ


వచ్చిన అప్లికేషన్‌లను ఆన్‌లైన్‌ చేయడానికి భారీగా డీటీపీ ఆపరేటర్లను నియమించింది ప్రభుత్వం. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో వేగంగా పని జరగకపోతే మరికొంతమందిని నియమించాలని కూడా భావిస్తోంది. ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వారి అర్హతలను ఎలా నిర్ణయిస్తుందనే విషయంపై మాత్రం వివరాలు వెల్లడించలేదు. వచ్చే నెల నుంచి మహిళలకు 2500వేలు ఇస్తామని ప్రకటించిన వేళ అసలు ఎవరికి వస్తుంది ఈ పథకం కోసం ఎలాంటి అర్హతలు తెరపైకి తీసుకొస్తారనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది. 


Also Read: Revanth Reddy: కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌ నియామకం, మరో 25 మందికి చోటు