Power  Demand in India: హైదరాబాద్‌: టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ దేశంలో రోజువారీ విద్యుత్‌  డిమాండు సైతం అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 17న విద్యుత్ డిమాండ్ 2.34 లక్షల మెగావాట్లు దాటిందని కేంద్ర విద్యుత్‌శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా 7,255 మెగావాట్ల కొరత ఏర్పడటంతో పలు రాష్ట్రాల్లో కొన్నిగంటల సేపు కరెంటు కోతలు విధించడం తెలిసిందే. 


2041-42 నాటికి రాష్ట్రాల గరిష్ఠ విద్యుత్‌ డిమాండు పెరుగుదలపై కేంద్రం తమ అంచనాలను విడుదల చేసింది. గత వేసవిలో అత్యధికంగా 2.26 లక్షల మెగావాట్లు డిమాండ్ ఏర్పడింది. వర్షాకాలంలో కొంచెం తగ్గాల్సింది పోయి, అంతకన్నా పెరిగింది. దాంతో విద్యుత్ వినియోగం, డిమాండ్లపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థలను కేంద్రం అలెర్ట్ చేసింది. వర్షాకాలంలో పంటలకు, కంపెనీలకు విద్యుత్ వినియోగం పెరుగుతుందని, అందుకు తగ్గ సరఫరా లేకపోతే సమస్యలు తప్పవని చెప్పింది. 


కేంద్రం వెల్లడించిన విద్యుత్‌ వినియోగం వివరాలు ఇలా.. 
2021- 22లో తెలంగాణలో 7,087 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగించగా.. 2031- 32లో అది 12,054 కోట్ల యూనిట్లకు, 2041- 42 వచ్చేసరికి 19,633.80 కోట్ల యూనిట్లకు పెరుగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేసింది. వినియోగం పెరగడమే కాదు, అందుకు తగ్గ ఉత్పత్తి జరిగి సరఫరా విషయంలో సమస్య తలెత్తుతుందని హెచ్చరించింది. 2021- 42 మధ్యకాలంలో ఏపీలో విద్యుత్ వినియోగం, డిమాండ్ 6,843 కోట్ల నుంచి 21,546 కోట్ల యూనిట్లకు పెరుగుతుందని కేంద్రం అంచనా వేసింది. 


మరోవైపు కాలుష్య రహిత వాహనాలంటూ ఎలక్ట్రిక్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ప్రోత్సహిస్తున్నాయి. 2031-32లో దేశంలో విద్యుత్‌ వాహనాల సంఖ్య 4.91 కోట్లకు చేరుతాయని.. వాటి ఛార్జింగ్‌కు 2,700 కోట్ల యూనిట్ల కరెంటు అవసరమని విద్యుత్ శాఖ భావిస్తోంది. దాంతో 2042 నాటికి దేశంలో వాహనాలు విద్యుత్ ఛార్జింగ్ తో నడిచేవి ఉంటాయి. కనుక వాటికి రోజుకు సగటున 5 నుంచి 8 గంలు ఛార్జింగ్ కు అవసరమైన విద్యుత్ సరఫరాకు సంబంధించి డిస్కంలు ఏర్పాటు చేయాలని కేంద్రం పేర్కొంది.


కొన్ని రాష్ట్రాల్లో గరిష్ట విద్యుత్ డిమాండ్ (ఒక్కరోజుకు మెగావాట్లలో)
రాష్ట్రం                    2021-22      2031-32      2041-42
ఉత్తరప్రదేశ్     -    24,991           44,066        67,170
గుజరాత్          -    19,457            36,287        55,267
తమిళనాడు     -    16,899            28,291       41,543
మధ్యప్రదేశ్     -    15,941            27,386       40,412
కర్ణాటక            -     14,841            21,613      31,071
తెలంగాణ       -     14,176            27,059       47,349
ఆంధ్రప్రదేశ్   -     12,563            24,387       37,081
పశ్చిమ బెంగాల్ -  9,090              16,824       26,562
దేశం మొత్తం     - 2,03,115        3,66,393      5,74,689