ఆసియా కప్‌ ఆడేందుకు 17 మందితో కూడిన టీంను బీసీసీఐ ప్రకటించింది. విండీస్, ఐర్లాండ్‌ టోర్నీలో సత్తా చాటిన చాలా మంది యువకులకు నిరాశే ఎదురైంది. ఒక్క తిలక్ వర్మను మాత్రమే తుది జట్టులోకి తీసుకున్నారు. 


ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 2023 ఆసియా కప్ కోసం బీసీసీఐ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.


యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ కు నిరాశ


సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఆసియా కప్ టీంలో చోటు దక్కలేదు. బ్యాకప్ వికెట్ కీపర్‌గా శాంసన్‌ను జట్టులోకి తీసుకోనున్నారు.


రోహిత్ శర్మ సారథ్యంలోని ఆసియా కప్‌ ఆడే భారత జట్టులోకి కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి వచ్చారు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయాల కొన్ని రోజులుగా జట్టుకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్‌తో జట్టులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ చివరిసారిగా ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. ఆ తర్వాత టోర్నమెంట్ మొత్తంలో ఆడలేకపోయాడు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పునరాగమనంతో టీమ్ఇండియా మిడిలార్డర్ చాలా బలంగా కనిపిస్తోంది.


రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (రిజర్వ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.


సెప్టెంబర్ 2న పాకిస్థాన్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.


2023 ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. 2023 ఆసియా కప్‌లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 17న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.