Rahul Gandhi Holding Poonam Kaur Hand: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నటి పూనమ్ కౌర్ ఆయన చెయ్యి పట్టుకొని కొంత దూరం నడిచిన వ్యవహారం బీజేపీ నేతల నుంచి విమర్శలకు తావిస్తోంది. రాహుల్ గాంధీ - పూనమ్ కౌర్ చేతి వేళ్లు పెనవేసుకొని నడిచిన ఫోటోలు బయటికి రావడంతో బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ రాహుల్ గాంధీ పూనమ్ చేయి పట్టుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. తాత అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నాడని ఎద్దేవా చేస్తూ కామెంట్ పెట్టారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా స్పందించారు. నరేంద్ర మోదీ మహిళలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. ప్రీతి గాంధీ క్షమాపణలు చెప్పి తన ట్వీట్‌ను డిలీట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
క్లారిటీ ఇచ్చిన పూనమ్
ఇలాంటి పరిస్థితుల్లో నటి పూనమ్ కౌర్ స్వయంగా స్పందించారు. తాను జారి పడబోయినందున రాహుల్ గాంధీ తన చేయి పట్టుకున్నారని వివరణ ఇచ్చారు. రాహుల్ తన చేయి పట్టుకోవడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పక్క నారీశక్తి అని మాట్లాడుతుంటే బీజేపీ నేతలు ఇలా చేయడం తగదని, ఇది చాలా అవమానకరం అంటూ పూనమ్ కౌర్ అసహనం వ్యక్తం చేశారు.
‘‘ఇది చాలా అవమానకరం. ప్రధాన మంత్రి మోదీ నారీశక్తి గురించి మాట్లాడుతున్నారు గుర్తుంచుకోండి. నేను జారి పడబోయాను.. అప్పుడు రాహుల్ సర్ ఇలా నా చెయ్యి పట్టుకుని సపోర్ట్ ఇచ్చారు’’ అని ప్రీతి గాంధీ చేసిన ట్వీట్‌కి బదులిచ్చారు.
శనివారం (అక్టోబరు 24) మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్రలో భాగంగా రాహుల్ తో కలిసి నడిచారు పూనమ్ కౌర్. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి నటి వివరించారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత సరకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని పూనమ్ కౌర్, ఈరవత్రి అనిల్, అల్ ఇండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్య రాహుల్ గాంధీని కోరారు. తాము అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీ లేకుండా చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దీన్ని పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళలపై రాహుల్ గాంధీకున్న గౌరవభావాలు తన హృదయాన్ని స్పృశించాయని ట్వీట్ చేశారు. అంతేకాదు చేనేత కార్మికుల తరపున రాహుల్ గాంధీకి ధన్యవాదాలు కూడా తెలిపారు.
వివాదం ఇలా మొదలైంది
రాహుల్ గాంధీ పూనమ్ చేయి పట్టుకున్న ఫొటోను బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ ట్వీట్ చేశారు. తాత అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నాడని ప్రీతి కామెంట్ పెట్టారు. అంతే ఇక రచ్చ మొదలైంది. సోషల్ మీడియాలో రాహుల్, పూనమ్ కౌర్ ఫొటోపై ఫైట్ తీవ్రమైంది.