తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను ఎలాంటి దోషాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకే అప్పగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో ఐదో రోజు ఆదివారం (అక్టోబరు 30) పాదయాత్ర ముగిసింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర సాయంత్రం షాద్‌ నగర్‌లో ముగిసింది. షాద్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఎలాంటి హింస, ఇబ్బందులు లేకుండా భారత్ జోడో యాత్ర నడుస్తోందని, ఈ యాత్రను ఏ శక్తి ఆపలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎండ వచ్చినా, వాన కురిసినా, తుపాన్లు వచ్చినా సరే కశ్మీర్ వరకు యాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. 


టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకే కోవకు చెందినవని రెండూ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ చట్టాలతో పాటు పార్లమెంట్‌ లో బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, ఎన్నికలప్పుడు కలిసి డ్రామాలాడుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు తెలంగాణలో పాలన పట్ల తమ గోడు చెప్పుకుంటున్నారని.. బీజేపీ, టీఆర్ఎస్‌ లీడర్లు తెలంగాణ ప్రజల గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు.


మోదీ పాలన వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసరాలు వంటి అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటినా మోదీ దానిపై నోరు విప్పడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, సన్నకారు వ్యాపారులకు అనేక రకాలుగా మేలు చేస్తామని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాస్కి గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


53 రోజుల నుంచి కొనసాగుతున్న యాత్ర
కన్యాకుమారి నుంచి 53 రోజులుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. రైతులు, విద్యార్థులు, గిరిజనులు, చేనేత సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ విద్వేషం, టీఆర్ఎస్ దోపిడీపై విమర్శలు కురిపిస్తూ వెళ్తున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేటు పరం అవుతోందంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పెద్దాయిపల్లి వద్ద జోడో యాత్రకు భోజన విరామం ఉంది. అక్కడే యాత్రలో పాల్గొంటున్న వారంతా భోజనం చేయనున్నారు. అనంతరం సాయంత్రం షాద్ నగర్ సోలిపూర్ జంక్షన్ కు చెరుకోనున్నారు. అక్కడే రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. 


నేతలతో పరుగులు పెట్టించిన రాహుల్
భారత్ జోడో యాత్రలో ఆదివారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ కాసేపు ఉత్సాహంగా పరుగులు పెట్టారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ శ్రేణులను పరుగులు పెట్టించారు. ఫిట్‌నెస్ ఫర్ భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ కొద్దిసేపు పరుగు తీసి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్ ను అనుసరించి రన్నింగ్ చేశారు.


తెలంగాణలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న రాహుల్ పాదయాత్ర, ఆపై 12 రోజులపాటు జనజీవన స్రవంతితో ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు.